ప్రజాశక్తి - కాళ్ల
నీటి సమృద్ధితో సుపరిపాలన అందించిన గ్రామంగా జువ్వలపాలెం గ్రామపంచాయతీకి అవార్డు లభించింది. జువ్వలపాలెం గ్రామంలో నాలుగు వేల మంది జనాభా ఉన్నారు. ప్రతిరోజు రెండు పూటలా నీటిని పంపిణీ చేస్తున్నారు. గ్రామంలో ఐదు మంచినీటి చెరువులు ఉన్నాయి. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా మంచినీటి చెరువును ఎప్పటికప్పుడు శుభ్రం చేసి బాధ్యతగా గ్రామ సర్పంచి మీసాల రమణ, ఉప సర్పంచి కఠారి లక్ష్మీపతిరాజు కృషి చేస్తున్నారు. రక్షిత మంచినీటి పథకం చెరువు సుమారు నాలుగు ఎకరాలు విస్తీర్ణం నీటిని సమృద్ధిగా నింపారు. రెండు ఓవర్ హెడ్ ట్యాంకులు, నాలుగు ఫిల్టర్ బెడ్లు ఉన్నాయి. 777 కుళాయిలు నాలుగు సెక్షన్ల ద్వారా ఫిల్టర్ చేసిన నీటిని అందిస్తున్నారు. అన్ని ప్రాంతాలకు నిరంతరం నీటి సరఫరాను అందించింది. నాణ్యమైన నీటి సరఫరాను నిరంతరాయమైన పరిశుభ్రమైన నీటి సరఫరాను కలిగి ఉన్న ఏకైక గ్రామం జువ్వలపాలెం. జువ్వలపాలెం గ్రామపంచాయతీ ఉత్తమ పంచాయతీగా మండల స్థాయి అవార్డును సాధించింది. గ్రామ సర్పంచి మీసాల రమణ, గ్రామ కార్యదర్శి గొట్టుముక్కల కృష్ణశివరామరాజు, మండల కో-ఆప్షన్ సభ్యులు గుఱ్ఱం బెన్హర్, ఎంపిటిసి సభ్యులు మీసాల శ్రీనివాస్, ఉప సర్పంచి కఠారి లక్ష్మీపతిరాజులను కాళ్ల ఎంపిపి పి.శిరీషవిశ్వనాథరాజు, ఎంపిడిఒ జి.స్వాతి, సత్కరించి ప్రశంసా పత్రాన్ని అందించారు. గ్రామ కార్యదర్శి గొట్టుముక్కల కృష్ణ శివరామరాజు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి పంచాయతీలే కీలకమన్నారు.










