అనంతపురం సిటీ : జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు పనులను జూన్ 12వ తేదీ లోపు పూర్తి చేయాలని డిఇఒ ఎం.సాయిరామ్ ఎంఇఒలకు ఆదేశించారు. మంగళవారం ఉదయం నగరంలోని జిల్లా సైన్‌సెంటర్‌లో ఎంఇఒలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఇఒ మాట్లాడుతూ జిల్లాలో నాడు-నేడు రెండో విడత పనులను జూన్ 12వ తేదీ లోపు పూర్తి చేయాలన్నారు. ఈ నెల 25వ తేదీ నియోజకవర్గ స్థాయి జగనన్న ఆణిముత్యాల అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జేవీకే-4ను పరిశీలించి పాఠశాలలు పున:ప్రారంభం అయ్యే రోజు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ పది పరీక్షలు రాస్తున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అంగన్వాడీ స్కూల్ పిల్లల్లో ఐదేళ్ల పూర్తయిన వారిని గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. అనంతరం జగనన్న ఆణిముత్యాల అవార్డుల ప్రదానోత్సవానికి సంబంధించిన ఆహ్వానపత్రికలు, కరపత్రాలను ఎంఇఒలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏసి గోవింద నాయక్, డివైఈఓలు పద్మప్రియ, శంకరప్రసాద్, ఎంఈవోలు పాల్గొన్నారు.










