May 03,2023 09:06

ఐపిఎల్‌ బెట్టింగ్‌

            అనంతపురం కలెక్టర్‌ : క్రికెట్‌... ఒకప్పుడు జెంటిల్‌మెన్‌ క్రీడ. ఎంతో క్రీడా స్ఫూర్తితో అందరూ చూసే వారు. దేశానికి ఆడుతున్న జట్టు గెలిస్తే చూసేవారే గెలిచినంత సంబరాలు చేసుకునే వారు. ఒకరకంగా చెప్పాలంటూ క్రికెట్‌ ఆటగాళ్లను ఇంటి సభ్యులుగా ఆరాధించే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ఈ ఆటకు జూదం అనే భూతం పట్టుకుంది. క్రికెట్‌ ఆటగా కాకుండా జూదంగా మారిపోయింది. ముఖ్యంగా ఐపిఎల్‌ సీజన్‌ వచ్చిదంటే ఈ వికృత జూదక్రీడ మరింత అధికంగా అవుతోంది. యువత ఈ బెట్టింగ్‌ల మాయలో పడి అప్పులఊబిలో కూరుకుపోతున్నారు. ఆన్‌లైన్‌లోనూ జూదాలు అందుబాటులో ఉండడంతో చాలా మంది దీనికి బానిసలై సరస్వాన్ని కోల్పోతున్నారు. పోలీసులు దీనిపై నిఘా ఉంచినా దీనిని నియంత్రించలేని పరిస్థితి ఉంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలా మంది క్రీడాకారులు ఉన్నారు. ముఖ్యంగా క్రికెట్‌ ప్రేమికులు ఎక్కువ. క్రికెట్‌ మ్యాచ్‌ వస్తే టీవీలకు అతుక్కుపోయి ఆ ఆటను చూస్తూ ఆస్వాదిస్తారు. కుటుంబం అంతా కలిసి చూసే ఆట క్రికెట్‌. మారిన పరిస్థితుల దృష్ట్యా క్రికెట్‌ ఆటగా మర్చిపోయి జూదంగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్‌లో జోరుగా బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొందరు బుకీల అవతారం ఎత్తి దీనిని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని వారి నుంచి డబ్బులు గుంజేస్తున్నారు. ఒక్కసారి దీనికి అలవాటు పడిన వారు అందులో కూరుకుపోయి అప్పులపాలు అవుతున్నారు. ఇంటర్‌, డిగ్రీ చదివే విద్యార్థులు, వ్యాపారులు, సాప్ట్‌వేర్‌ ఉద్యోగులు ఎక్కువగా ఈ బెట్టింగ్‌లు ఆడుతున్నట్లు తెలుస్తోంది.
బంతిబంతికీ బెట్టింగ్‌..
బెట్టింగ్‌లో అనేక రకాల పద్ధతులను అవలంభిస్తున్నారు. గతంలో మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారన్న దానిపై మాత్రమే బెట్టింగ్‌ జరిగేది. ఐపిఎల్‌ వచ్చాక బెట్టింగ్‌లోనూ కొత్త పద్ధతులు వచ్చాయి. బంతిబంతికీ బెట్టింగ్‌ కాసే అవకాశాలను కల్పించారు. మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారు.? ఎన్ని పరుగులు సాధిస్తారు..? స్కోర్‌ సరి సంఖ్య వద్ద నిలుస్తుందా..? బేసి సంఖ్య వద్ద నిలుస్తుందా..? ఎక్కువ పరుగులు ఎవరు చేస్తారు..? వికెట్లు ఎవరు ఎక్కువ తీస్తారు.? ఇలా ఒక్కటేమిటి బంతిబంతికీ బెట్టింగ్‌ కాస్తున్నారు. పదులు, వందలు కాదు... వేలు, లక్షల్లో పందేలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్‌లోనూ బెట్టింగ్‌లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. సెల్‌ఫోన్ల ద్వారానే ఈ బెట్టింగ్‌లు ఆడేస్తున్నారు. ఇలా బెట్టింగ్‌కు బానిసైన వారు లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు.
పోలీసుల కళ్లు గప్పి...
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్రికెట్‌ బెట్టింగ్‌పై పోలీసులు పెద్ద ఎత్తున దృష్టి సారించారు. ఐపిఎల్‌ ప్రారంభ సమయంలోనే బెట్టింగ్‌లు ఆడేవారికి హెచ్చరికలు జారీ చేశారు. బెట్టింగ్‌ ఆడితే అరెస్టు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుటామని పోలీసు ఉన్నతాధికారులు తెలియజేశారు. అయినా వీరి హెచ్చరికలను బేఖాతర్‌ చేసి బెట్టింగ్‌లు ఆడతున్నారు. సాంకేతికతను ఉపయోగించి, పోలీసులకు అనుమానం రాకుండా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు సమాచారం. గతంలో చాలాసార్లు బెట్టింగ్‌ జూదరులను పోలీసులు అరెస్టు చేసి, కటకటాల వెనక్కి పంపారు. గతేడాది అయితే అంతర్‌రాష్ట్ర క్రికెట్‌ బుకీని అనంతలో అరెస్టు చేశారు. ఇలా ఓ వైపు పోలీసుల అరెస్టులు జరుగుతున్నా బెట్టింగ్‌ మాత్రం అదుపులోకి రావడం లేదు. వైరస్‌లా విస్తరిస్తున్న ఈ క్రికెట్‌ బెట్టింగ్‌పై పోలీసులు పూర్తి స్థాయి నిఘా ఉంచి నియంత్రించకపోతే భవిష్యత్తులో దీని బారిన పడి అనేక మంది వారి జీవితాలను నాశనం చేసుకునే ప్రమాదం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు.