జనసేన గెలుపునకు కృషి చేయాలి
ప్రజాశక్తి-కావలి : రాష్ట్రంలో కాపులకు రాజ్యాధికారం దక్కించుకునే దిశగా అడుగులు వేస్తున్న పవన్‌కళ్యాణ్‌ను, జనసేనను, ఆ పార్టీతో జట్టుకట్టనున్న మిత్రపక్షాల పార్టీల అభ్యర్థులను గెలిపించుకునే దిశగా కాపుసంక్షేమసేన (కె.ఎస్.ఎస్.) కృషి చేయాలని వక్తలు పిలుపు నిచ్చారు. ఆదివారం స్థానిక ఎ.వి.ఎస్. కళ్యాణ మండపంలో కె.ఎస్.ఎస్. కావలి నియోజకవర్గ ''కాపు సంక్షేమ సేన'' నూతన కమిటీ ఏర్పాటు సందర్భంగా జిల్లా అధ్యక్షులు సుధామాధవ్ అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యఅతిథులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రముఖ డాక్టర్ ఎన్.ప్రభాకర్ నాయుడు, కావలి జనసేన ఇన్‌ఛార్జి సుధాకర్, జిల్లా కార్యదర్శి సమ్మను వెంకటసుబ్బయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఎం.వి.రవీంద్ర, బలిజ కాపుసంఘం అధ్యక్షులు తోట వెంకటశేషయ్య, కావలి జనసేన సలహాదారు బెల్లంకొండ వెంకటేశ్వర్లు, ఆత్మకూరు ఇన్‌ఛార్జి నలిశెట్టి శ్రీధర్, సర్వేపల్లి ఇన్‌ఛార్జి సురేష్, తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు ప్రసంగిస్తూ ఎన్నికల్లో టిడిపి, జనసేన పొత్తులో భాగంగా కావలి నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థికి ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో కావలి నియోజకవర్గంలో కాపులకు ఉన్న 52వేల ఓట్లు వేరే అభ్యర్థికి పోకుండా ఓటు చేయించుకోగలిగితే, ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థి గెలిచి తీరుతారని జోస్యం చెప్పారు. ఒక్కో పార్టీ వెనుక ఇద్దరు, ముగ్గురు బలిజలు చేరి, వారిచేతుల్లోనే బలిజల ఓట్లు ఉన్నట్లు, బలిజ జాతికి ఆయా పార్టీలు ఏ మేలు చేయకపోయినా, తమ ఆధ్వర్యంలోనే బలిజ జాతి ఓట్లన్ని వేయిస్తామని, కొందరు కుల ద్రోహులు స్థానిక ఎంఎల్‌ఎ దగ్గర ప్రకటించడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటైనా కె.ఎస్.ఎస్. కావలి నియోజకవర్గ కమిటీ అధ్యక్షులుగా సాదుశ్రీధర్, పాలడుగు వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా, గుంటుపల్లి కృష్ణయ్య ఉపాధ్యక్షులుగా పసుపులేటి బాబురావు కార్యదర్శిగా, రామిశెట్టి కిషోర్ కార్యదర్శిగా, బెల్లంకొండ వెంకటేశ్వర్లు కార్యదర్శిగా, తిరుమల శెట్టి సుధీర్,ని కార్యదర్శిగా మొత్తం ఏడు మందిని కె ఎస్ ఎస్ సభ్యులుగా నియమించారు. ఈ సభలో విశిష్ట అతిథులుగా కాపు సంక్షేమ సేన జిల్లా జనరల్ సెక్రెటరీ పసుపులేటి ప్రసాద్, కె.ఎస్.ఎస్. యువసేన జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి లక్కాకుల శ్రీరాములు, మహిళా విభాగం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వాణి భవాని, ప్రధాన కార్యదర్శి హైమావతి, జిల్లా సోషల్ మీడియా విభాగం అధ్యక్షులు బండి అనిల్ రాయల్, తదితరులు పాల్గొన్నారు.










