
* దరఖాస్తు చేసి మూడేళ్లవుతున్నా మంజూరు కాని బోర్లు
* ఇప్పటివరకు 5,714 మంది దరఖాస్తు
* 246 చోట్లే బోర్ల తవ్వకాలు
* 13 మంది రైతులకే విద్యుత్ కనెక్షన్లు
ప్రభుత్వం ఘనంగా ప్రారంభించిన వైఎస్‌ఆర్ జలకళ పథకంపై ప్రస్తుతం నిలినీడలు కమ్ముకున్నాయి. జిల్లాలో సాగునీటి సౌకర్యం లేక వేలాది ఎకరాల భూములు నిరుపయోగంగానే ఉన్నాయి. ఆ భూముల్లో ఉచితంగా బోర్లు వేసి వాటిని వినియోగంలో తీసుకొస్తామంటూ వైసిపి ప్రభుత్వం మూడేళ్ల కిందట వైఎస్‌ఆర్ జలకళ పథకాన్ని తీసుకొచ్చింది. బోర్లతో పాటు విద్యుత్ కనెక్షనూ అందిస్తామని చెప్పడంతో రైతులు ఉత్సాహంగా దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల స్వీకరణ, సర్వే పూర్తి చేసి అర్హులైన వారికి అధికారులు అనుమతులు మంజూరు చేశారు. తొలుత పూర్తి ఖర్చు తామే భరిస్తామని ప్రభుత్వం చెప్పింది. తర్వాత రూ.2 లక్షల వరకు చెల్లిస్తామంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అదనపు భారం పడుతున్నా రైతులకు అంగీకరించారు. అయినా ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పందించకపోవడంతో అసలు పథకం ఉందా? లేదా? అన్న సందేహం రైతుల్లో వ్యక్తమవుతోంది.
ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి: చిన్న సన్నకారు రైతులకు మేలు కలిగించేందుకు వైసిపి ప్రభుత్వం 2020, సెప్టెంబరు 28న ప్రారంభించింది. బోరు సౌకర్యం లేని 2.5 ఎకరాలు నుంచి ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులను అర్హులుగా పేర్కొంది. బోర్ల తవ్వకం, విద్యుత్ కనెక్షన్లను ఉచితంగా ఇస్తామంటూ ప్రకటించింది. ప్రస్తుతం అందులో మార్పులు చేయడంతో అన్నదాతలు ఉసూరుమంటున్నారు. ఐదెకరాల్లోపు వారికి సైతం రూ.2 లక్షలోపు మాత్రమే విద్యుత్ కనెక్షన్ల ఖర్చు చేస్తామని, అంతకంటే ఎక్కువ అయితే రైతులే భరించాల్సి ఉంటుందని పేర్కొంది. అయినా రైతులు ఖర్చుకు వెనుకాడకుండా బోర్లు తవ్వించుకోవడానికి సిద్ధపడ్డారు. జిల్లాలో వైఎస్‌ఆర్ జలకళ పథకం కోసం మొత్తం 5,714 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 4690 దరఖాస్తులు అర్హమైనవిగా తేల్చారు. వాటిలో 2,299 చోట్ల సర్వే పూర్తి చేశారు. సర్వే పూర్తయిన వాటిలో 1057 ప్రాంతాల్లో బోర్ల తవ్వకాలకు అధిóకారులు అనుమతులు మంజూరు చేశారు. ఇప్పటివరకు 246 చోట్ల బోర్లు తవ్వారు. 229 ప్రాంతాల్లో నీళ్లు పడగా 17 చోట్ల నీరు పడలేదు. 13 మంది రైతుల పొలాలకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు
బోర్లు తవ్వినా విద్యుత్ కనెక్షన్లు ఇవ్వని వైనం
సాధారణంగా ఒక ట్రాన్స్‌ఫార్మర్, నాలుగు విద్యుత్ స్తంభాలు వేస్తే రూ.2 లక్షల అంచనా వ్యయం దాటిపోతుంది. లబ్దిదారుల్లో ఎక్కువ మంది ఒకటి నుంచి రెండు కిలోమీటర్ల మేర స్తంభాలు వేయాల్సిన వారు ఉన్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌తో కలిపితే వారికి రూ.5 నుంచి రూ.6 లక్షలు దాటిపోతోంది. ప్రభుత్వం కనీసం రూ.రెండు లక్షలు ఇచ్చినా మిగిలిన ఖర్చు భరించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కనిపించడం లేదు. ఐదెకరాల లోపు ఉన్న రైతులకు రూ.2 లక్షల వరకు విద్యుత్ కనెక్షన్ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పినా ఆ తర్వాత ఎవరికీ డబ్బులు చెల్లించలేదు. ఎక్కడా ఒక్క కనెక్షన్ ఇవ్వలేదు. కొన్నిచోట్ల విద్యుత్‌శాఖ కనెక్షన్లు ఇచ్చినా వాటికయినా ఖర్చునూ ప్రభుత్వం చెల్లించలేదని తెలుస్తోంది. ప్రభుత్వం విద్యుత్‌శాఖకు డబ్బులు ఇవ్వకపోవడంతో విద్యుత్‌శాఖ కనెక్షన్లను ఆపేసింది. దీంతో బోర్లు తవ్వి విడిచిపెట్టేయంతో మట్టి కూరుకుపోతోందని, త్వరగా తమకు విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
నిధులు విడుదల చేయకపోవడం వల్లేనా?
చిన్న సన్నకారు రైతులను ఆదుకునేందుకు గతంలో ఇందిర జలప్రభ, ఎన్‌టిఆర్ జలసిరి పేర్లతో ప్రభుత్వాలు అమలు చేశాయి. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేసి వైఎస్‌ఆర్ జలకళగా పేరు మార్చింది. బోర్లు, విద్యుత్ కనెక్షన్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించడంతో రైతులు ఆశతో దరఖాస్తు చేసుకున్నారు. ప్రారంభం నుంచి పలు నిబంధనలు మార్చడం, గిట్టుబాటు కాక డ్రిల్లింగ్ ఏజెన్సీలు ముందుకు రాకపోవడం, నిధుల లేమి, బిల్లుల చెల్లింపుల్లో జాప్యం తదితర కారణాలతో పురోగతి కనిపించడం లేదు. జిల్లాలో ఎచ్చెర్ల, ఆమదాలవలస, పలాస నియోజకవర్గాల్లో మాత్రమే బోర్ల తవ్వకాలకు డ్రిల్లింగ్ ఏజెన్సీలు ముందుకు వచ్చాయి. ప్రభుత్వం చెల్లిస్తున్న ధర గిట్టుబాటు కావడం లేదంటూ మిగిలిన నియోజకవర్గాల్లో ఏజెన్సీలు ఆసక్తి చూపడం లేదు. వేల మంది రైతులు దరఖాస్తు చేసుకుంటే ఈ రెండేళ్లలో వందల సంఖ్యలోనే బోర్లు తవ్వారు. పదుల సంఖ్యలోనే విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. బోర్ల కోసం తమ వంతు వాటాగా రైతులు భరించేందుకు సిద్ధంగా ఉన్నా... ప్రభుత్వం తరుపు నుంచి నిధులు విడుదల కాకపోవడంతో బోర్ల మంజూరు ప్రక్రియ నిలిచిపోయినట్లు తెలుస్తోంది.