ప్రజాశక్తి-పెద్దపంజాణి : మండలంలోని కోగిలేరు గ్రామ పంచాయతీ పరిధిలోని బసవరాజుకండ్రిగ,చీకలదిన్నేపల్లెలో జలజీవన్ మిషన్ (జేజేఎం) పథకం ద్వారా చేపట్టిన పైపులైన్ కొళాయిలను చిత్తూరు జిల్లా ఆర్డ బ్ల్యూఎస్.ఎస్.ఈ విజయకుమార్, క్వాలిటీ కంట్రోల్ డీ.ఈ భాస్కర్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. బసవరాజుకండ్రిగలో జీఐ పైపులైను,కొళాయిలను, చీకలదిన్నేపల్లెలో పైపులైను,కొళాయిల ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి స్థానిక సర్పంచ్ రమేష్ బాబు ను అభినందించారు.ఈ సందర్భంగా బసవరాజుకండ్రిగలో కొంతమంది పైపులైను కొళాయిలకు పైపులు అమర్చి నీటి సంపులకు నీటిని పట్టుకుంటున్నారని అలా చేయడం వలన కొంతమందికి నీళ్లు సరిపోవడం లేదు అని మహిళలు ఎస్ఈ విజయకుమార్ దృష్టికి తీసుకువచ్చారు.ఈ విషయంపై స్పందించిన ఆయన అలా చేయరాదని కొళాయిలకు ఎవరైనా పైపులు లేదా మోటరు ద్వారా నీటిని మళ్ళించరాదని తెలిపారు.కొళాయిల ద్వారా అందరూ సరిపడా నీటిని పట్టుకోవాలని, మంచినీటిని వృధా చేయరాదని మహిళలకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్డ బ్ల్యూఎస్ డీఈ రవికిరణ్,ఏఈఈ నందకుమార్, సర్పంచు రమేష్ బాబు,ఎంపీటీసీ పరందామ,తదితరులు పాల్గొన్నారు.










