
* అధికారులకు స్పీకర్ ఆదేశం
ప్రజాశక్తి - శ్రీకాకుళం: జల జీవన్ మిషన్ పనులను వేగవంతం చేయాలని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్ అండ్ బి అతిథిగృహంలో ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెజెఎం పథకంలో భాగంగా ఆమదాలవలస నియోజకవర్గానికి రూ.157 కోట్లతో ప్రతి గ్రామంలోనూ పనులు మంజూరయ్యాయన్నారు. వీటిలో ఎన్ని పూర్తయ్యాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన వాటినీ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నీటి నిల్వల కోసం వాటర్ ట్యాంకుల నిర్మాణానికి అవసరమయ్యే ప్రభుత్వ స్థలాలను గుర్తించాలన్నారు. గ్రామాల్లో రెవెన్యూ అధికారులు గుర్తించిన స్థలాల్లో, వాటర్ ట్యాంకుల నిర్మాణం చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ట్యాంకుల నిర్మాణానికి అవసరమయ్యే స్థల సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. నియోజకవర్గంలో 182 వాటర్ ట్యాంకుల నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయని తెలిపారు. ఆమదాలవలస మండలానికి 47, సరుబుజ్జిలి మండలానికి 43, బూర్జ మండలానికి 52, పొందూరు మండలానికి 40 వాటర్ ట్యాంకులు మంజూరయ్యాయని చెప్పారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.