Sep 24,2023 00:01

శ్రీకాకుళం అర్బన్‌ : నిరసన తెలుపుతున్న ఫ్యాప్టో నాయకులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌: రాష్ట్ర మంత్రివర్గం గ్యారంటీ పెన్షన్‌ స్కీం జిపిఎస్‌ను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యాన ఉపాధ్యాయులు శ్రీకాకుళం తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా చేపట్టారు. అధికారంలోకి రాకముందు ప్రస్తుత ముఖ్యమంత్రి సిపిఎస్‌ను వారం రోజులలో రద్దు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి నాలుగున్నర ఏళ్లు దాటుతున్నా సిపిఎస్‌ రద్దు చేయలేదు సరి కదా, గ్యారెంటీ పెన్షన్‌ స్కీమ్‌ పేరుతో ఉపాధ్యాయులను, ఉద్యోగులను మోసపుచ్చే విధంగా తయారైందని మండిపడ్డారు. పాత పెన్షన్‌ విధానం తప్ప మరేది ఆమోదించేది లేదని తేల్చిచెప్పారు. ఎస్‌.కిషోర్‌కుమార్‌ మాట్లాడుతూ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు సిపిఎస్‌, జిపిఎస్‌ వల్ల ఏమాత్రం ప్రయోజనం కాదని అన్నారు. జిపిఎస్‌ అనేది పేరు మార్చే మోసమని అంకెల గారిడి మోసమని అన్నారు. గత పిఆర్‌సిలో అంకెలు గారిని చేసి ఏ రకంగా మోసం చేశారో... అదే రీతిలో జిపిఎస్‌ విధానం తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు. చౌదరి రవీంద్ర మాట్లాడుతూ ఉపాధ్యాయులను, ఉద్యోగులను మోసపుచ్చే విధంగా ఇచ్చిన మాట తప్పడం సరికాదన్నారు. టి.చలపతిరావు మాట్లాడుతూ సిపిఎస్‌ రద్దు చేస్తామని మాట ఇచ్చి అమలు చేయాలన్నారు. కరిమి రాజేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలన్నీ ఏకమై ఈ పరిస్థితిని పోరాటంతో ఎదుర్కొంటామని పిలుపునిచ్చారు. చావలి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రపంచీకరణలో భాగంగా ప్రభుత్వం ఉద్యోగుల బాధ్యతలను క్రమక్రమంగా వదిలించుకుంటుందన్నారు. అందులో భాగమే జిపిఎస్‌ అమలు చేయడమని పేర్కొన్నారు. కొప్పల డేనియల్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఈ రకమైన ప్రభుత్వ విధానాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ప్రతాప్‌ మాట్లాడుతూ నిర్బంధాలతో ఆందోళనలను ఆపలేరని అన్నారు. తహశీల్దార్‌ వెంకటరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వై.ఉమాశంకర్‌, జి.సురేష్‌, డి.రామ్మోహనరావు, డి.రవి పాల్గొన్నారు.
పొందూరు: రాష్ట్ర ప్రభుత్వం జిపిఎస్‌ విధానం అమలు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పొందూరు పాత తాలూకా కేంద్రం వద్ద శనివారం ఫ్యాప్టో, ఎపిసిపిఎస్‌ఇఎ సంయుక్తంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. సిసిఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్దరిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. ఈ నెల 25న చలో కలెక్టరేట్‌కు పిలుపునిచ్చామని అన్నారు. అనంతరం తహశీల్దార్‌ వై.వి.ప్రసాద్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఫ్యాప్టో చైర్మన్‌ మజ్జి మదన్‌మోహన్‌, కో-చైర్మన్లు పొందూరు అప్పారావు, పూజారి హరిప్రసన్న, ఎపిసిపిఎస్‌ఇఎ మాజీ మక్క సురేష్‌, వివిధ సంఘాల బాధ్యులు మొగదాల రమణరావు, కోరుకొండ విజరుకుమార్‌, కిలారి వెంకటరమణ, గండెం రామారావు, గురుగుబెల్లి భాస్కరరావు పాల్గొన్నారు.
టెక్కలి : సామాజిక భద్రతకు మారుపేరుగా ఉన్న ఒపిఎస్‌ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా అమలుజేయాలని చూస్తున్న జిపిఎస్‌ విధానం రద్దు చేయాలని ఫ్యాప్టో, ఎపిసిపిఎ ఆధ్వర్యాన తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు ధనుంజయరెడ్డి, గున్న ప్రసాదరావు, పాలవలస ధర్మారావు, డి.లక్ష్మీనారాయణ, కుప్పిలి కామేశ్వరరావు, శ్రీనివాసరావు, బాబూరావు, వజ్జ ఆదినారాయణ పాల్గొన్నారు.
సోంపేట: సోంపేట తహశీల్దార్‌ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసనలో లండ బాబూరావు, ఎస్‌.చాణక్య, ఎన్‌.మోహనరావు, రమేష్‌ పాణిగ్రాహి, జి.రాజేష్‌, టి.చంద్రశేఖర్‌, బి.శోభన్‌బాబు, ఎస్‌.గోపి, ఎన్‌.రవి, డి.గోవిందరావు, ఎస్‌.కిరణ్‌ పాల్గొన్నారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.