Nov 12,2023 00:00

వినతిపత్రం అందజేస్తున్న ఎపి ఉపాధ్యాయ సంఘ సభ్యులు

ప్రజాశక్తి- కవిటి : ఇటీవల కాలంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు పరిష్కారమయ్యేలా సహకరిస్తు, ప్రభుత్వం చెబుతున్న జిపిఎస్‌ రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్‌ను ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం సభ్యులు కీలు సోమేశ్వరరావు, బండారు శంకరం కోరారు. శనివారం కవిటి మండలం రామయ్యపుట్టుగలో ఎమ్మెల్యేను కలిసిన సంఘ సభ్యులు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జిపిఎస్‌ జిఒ 116ను ఉపసంహరించుకుని, సిఎం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు పాత ఫెన్షన్‌ విధానం కొనసాగించాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తు, ఉపాధ్యాయుల సౌలభ్యం దృష్టిలో ఉంచుకుని జిఒ నెం 117 రద్దు చేయాలని కోరారు. అలాగే ఉద్యోగ, ఉపాధ్యాయ, ఫెన్షన్‌దారుల పిఎఫ్‌, ఎపిజిఎల్‌ఐ, సంపాధిత సెలవులు, ఇతర ఆర్థిక బకాయిలు సెప్టెంబర్‌ 30లోగా పూర్తిగా చెల్లిస్తామని, పిఆర్‌సి, డిఎ బకాయిలు అకోబర్‌ 31లోగా ఇస్తామని చెప్పినా ఇంతవరకు ఎటువంటి పురోగతి లేదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆనింగి నాగేశ్వరరావు, తారకేశ్వరారావు, మల్లేష్‌, సత్యానంద్‌, చిరంజీవి పాల్గొన్నారు.