Oct 09,2023 20:51

ఫొటో : మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌

జిల్లాలోని ప్రాజెక్టుల పనులు చేపట్టాలి
ప్రజాశక్తి-జలదంకి : రామాయపట్నం పోర్టును కేంద్ర ప్రభుత్వం నిధులతోనే నిర్మించాలని, సోమశిల హైలెవెల్‌ కెనాల్‌, రాళ్లపాడు ప్రాజెక్టు, సీతారామ సాగర్‌, గండిపాలెం ప్రాజెక్ట్‌, పెద్దారెడ్డిపల్లి రిజర్వాయర్‌, సర్వేపల్లి రిజర్వాయర్‌, ఆధునికీకరణ పనులకు ప్రభుత్వం నిధులు కేటాయించి సత్వరమే పనులు పూర్తి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ డిమాండ్‌ చేశారు. నెల్లూరు జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర సోమవారానికి మండల కేంద్రమైన జలదంకికి చేరింది. అక్టోబర్‌ 2న గుడ్లూరు మండలంలోని రామాయపట్నం పోర్టు సందర్శన అనంతరం చేవూరులో సభ జరిగింది. పోర్టు నుంచి ప్రారంభమైన సిపిఎం పాదయాత్ర ఉలవపాడు, కందుకూరు, గుడ్లూరు, వలేటివారిపాలెం, లింగసముద్రం, కొండాపురం, కలిగిరి మండలాల మీదుగా జలదంకి మండలంలోని చినక్రాక గ్రామానికి ఆదివారం సాయంత్రానికి చేరుకుంది. జలదంకిలో సిపిఎం నేతలు రావి మాల్యాద్రి, గడ్డం మాల్యాద్రి, బత్తల నరసింహ, ఆంథోనిబాబు, తదితరులు పాదయాత్రకు ఘనంగా స్వాగతం పలికారు.
జలదంకిలో ప్రధాన గ్రామంతో పాటు ఎస్‌సి కాలనీలలో పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా జలదంకి బస్టాండ్‌ సెంటర్లో సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ మాట్లాడుతూ జిల్లాలోని సమస్యలన్నీ సమగ్రంగా పరిష్కరించాలని కోరుతూ జిల్లా అభివృద్ధి కోసం సిపిఎం పాదయాత్ర చేపట్టిందని తెలిపారు. రామాయపట్నం పోర్టును కేంద్ర ప్రభుత్వం నిధులతోనే నిర్మించాలని, సోమశిల హైలెవెల్‌ కెనాల్‌, రాళ్లపాడు ప్రాజెక్టు, సీతారామ సాగర్‌, గండిపాలెం ప్రాజెక్ట్‌, పెద్దారెడ్డిపల్లి రిజర్వాయర్‌, సర్వేపల్లి రిజర్వాయర్‌, ఆధునికీకరణ పనులకు ప్రభుత్వం నిధులు కేటాయించి సత్వరమే పనులు పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. కృష్ణపట్నం, రామాయపట్నం పోర్టులకు అనుసంధానంగా ఏర్పడిన పరిశ్రమలలో స్థానికులకు 75శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. జిల్లాలోని మెట్ట ప్రాంతాలలో ప్రత్యేక ప్రాధాన్యతతో పరిశ్రమలు ఏర్పాటు చేసి, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. నెల్లూరు జిల్లాలో విమానాశ్రయం పనులకు నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్ల నిర్మాణంలో భాగమైన రాపూరు, ఆత్మకూరు, వింజమూరు, వరికుంటపాడు మీదుగా వెళ్లే రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్రం నిధులు కేటాయించి, పనులు తొందరగా పూర్తి చేసి మెట్ట ప్రాంత ప్రజానీకానికి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దష్ట్యా ఉపాధి హామీ పని దినాలను 200 రోజులకు పెంచి కనీస వేతనం రూ.600 ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పథకాన్ని పట్టణ ప్రాంతాలలోనూ అమలు చేయాలన్నారు. బిట్రగుంట లోకో షెడ్‌ ఆధునికీకరణ, జువ్వలదిన్నెలో ఫిషింగ్‌ హార్బర్‌లను త్వరగా నిర్మించాలన్నారు. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలన్నారు. ఆర్‌బికెల ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, యాంత్రీకరణ పనిముట్లు రైతులకు పూర్తిస్థాయిలో అందజేయాలని, రైతన్నలు పండించిన ప్రతి పంటను గిట్టుబాటు ధరలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలోని ఆర్‌బికె, ఎఫ్‌సిఐల ద్వారా కొనుగోలు చేయాలన్నారు. జలదంకి, కావలి, బోగోలు మండలాలలో తాగునీటి సమస్యల పరిష్కారానికి సమ్మర్‌ స్టోరేజీ ట్యాంక్‌ను నిర్మించి ప్రజల దాహార్తిని తీర్చాలన్నారు. పంట కాలువలకు పూడికతీత పనులు కేటాయించి పనుల కోసం నిధులు కేటాయించి వ్యవసాయానికి తోడ్పడాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం సీనియర్‌ నాయకులు తాళ్లూరు మాల్యాద్రి, జిల్లా కమిటీ సభ్యులు షేక్‌ రహనాబేగం, గండవరపు శేషయ్య, వేణు, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు షేక్‌ శంషాద్‌, షేక్‌ రహ్నామా, నారాయణ, ప్రసాదు, యానాదయ్య, తదితరులు పాల్గొన్నారు.