Jul 31,2023 22:47

ఫొటో : విలేకరులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ గౌతమి

       అనంతపురం కలెక్టరేట్‌ : జిల్లాలో విజయవంతంగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని పూర్తి చేశామనిజిల్లా కలెక్టర్‌ ఎం.గౌతమి తెలిపారు. సోమవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో జగనన్న సురక్ష కార్యక్రమంపై నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జగనన్న సురక్ష కార్యక్రమం జిల్లాలో దాదాపు నెల రోజులపాటు నిర్వహించామన్నారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు జగనన్న సురక్ష కార్యక్రమం కింద ఏం చేయబోతున్నాం అన్న విషయాన్ని ప్రజలకు తెలియజేశారన్నారు. ఇందులో ప్రజలకు 11 రకాల సర్టిఫికెట్లకు సంబంధించిన సేవలను అందించినట్లు చెప్పారు. జగన సురక్ష కార్యక్రమం కింద మరో అడుగు ముందుకువేస్తూ వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేర్చే ప్రయత్నం జరిగిందన్నారు. ఆ సచివాలయం పరిధిలో సురక్ష కార్యక్రమం కింద నిర్వహించిన క్యాంపులో పరిశీలన పూర్తి చేసి లబ్ధిదారులకు వారి గ్రామంలోనే సర్టిఫికెట్లు అందించామన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఆయా స్థాయిలో అధికారులతో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 663 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు చెప్పారు. జగనన్న సురక్ష కార్యక్రమం కింద జిల్లాలో 2,51,614 సర్వీస్‌ రిక్వెస్ట్‌లు రాగా, అందులో 2,47,641 అర్జీలకు పరిష్కారం చూపించి అందరికీ సర్టిఫికెట్లు పంపిణీ చేశామని చెప్పారు. గతంలో సర్టిఫికెట్ల కోసం మండల, జిల్లా కేంద్రాలకు వెళ్లి ఎవరిని కలవాలో తెలియక ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని, సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత పరిస్థితి మారిందన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలకు కలెక్టర్‌ కతజ్ఞతలు తెలిపారు.