ప్రజాశక్తి - పాలకొల్లు
అల్పద్రోణి ప్రభావంతో వరుసగా మూడో రోజు సోమవారం తెల్లవారుజాము నుంచి నియోజకవర్గంలో భారీ వర్షం పడింది. దీంతో జనజీవనం స్తంభించింది. రోజువారీ పనులు చేసుకునేందుకు ప్రజలు బయిటకు రాని పరిస్థితి నెలకొంది. పట్టణంలోని రోడ్లు, డ్రెయిన్లు ఏకమై జలాశయాలుగా మారాయి. ఇంటర్ పరీక్షలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మొగల్తూరు : మండలంలో సోమవారం తెల్లవారుజామున కురిసిన వర్షంతో పలు రహదారులపై నీరు నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మొగల్తూరులోని పక్కా డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు రహ దారులపై నిలిచిపోయింది. ప్రజలు అంటువ్యాధులు ప్రబలతాయని ఆందోళన చెందుతున్నారు.
పెనుమంట్ర : అల్పపీడన ద్రోణి ప్రభావంతో సోమవారం మధ్యాహ్నం నుంచి మండలంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఉదయం 6 గంట సమయంలో కొద్దిపాటి వర్షం పడింది. మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా పిడుగులు, ఉరుములతో కూడిన భారీ వర్షం పొలమూరు, మాముడూరు, పెనుమంట్ర, గరువు, మార్టేరు, ఆలమూరులో పడింది.
పాలకొల్లు రూరల్: సోమవారం ఉదయం మండలంలోని పలు గ్రామాల్లో ఎడతెరిపిలేని వర్షం కురిసింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉదయం 9 గంటల తర్వాత నుండి వాతావరణం అనుకూలించడంతో ఊపిరి పీల్చుకున్నారు.










