జిల్లాలో పెద్దిరెడ్డి అరాచకం
వత్తాసు పలుకుతున్న ఎస్పీ
టిడిపి అధికారంలోకి వచ్చాకా ఒక్కర్నీ వదలం
టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్
ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్:
జిల్లాలో పెద్దిరెడ్డి అరాచక పాలన సాగుతోందని, వైసిపి కుక్కల్ని ఎగదోలి టిడిపి నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారని టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా చిత్తూరు సబ్‌జైల్‌లోని తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలను మంగళవారం పరామర్శించారు. ఆయనతోపాటు మాజీ మంత్రులు చిన్నరాజప్ప, అమరనాథరెడ్డిలను జైలులోకి అనుమతించారు. దాదాపు అరగంట పాటు సబ్‌జైలులో టిడిపి నాయకులతో మాట్లాడారు. అనంతరం విలేకర్ల సమావేశంలో అధికార పార్టీ తీరుపై లోకేష్‌బాబు నిప్పులు చెరిగారు. కుప్పంలో మంత్రి పెద్దిరెడ్డి, ఎంఎల్‌సి భరత్ జిల్లా ఎస్పీని అడ్డం పెట్టుకొని అరాచకాలు సృష్టించాలని చూస్తున్నారు. దేశం నేతలు, కార్యకర్తలపై కొందరు భరితెగించిన వైకాపా నేతలు దాడులకు తెగబడ్డారు. కొందరు పోలీసులు ఉద్ధేశపూర్వకంగా అధికార పార్టీకి సహకరిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపి విజయం సాధించడం ఖాయమని ఒకోక్కర్ని గుర్తు పెట్టుకుంటాంమని, ఎస్పీ స్థాయి అధికారులను కూడా వదలిపెట్టే ప్రసక్తి లేదని, వడ్దీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. ఇటీవల కుప్పంలో చోటుచేసుకున్న సంఘటనలో పోలీసుల కేసుల్లో పలువురు కార్యకర్తలు అరెస్టు కావడం జరిగిందన్నారు. రాష్ట్రంలో రౌడీరాజ్యం నడుస్తోందన్నారు. ఏడుసార్లు కుప్పం నియోజకవర్గంలో విజయం సాధించిన చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. కుప్పం ఘటనలో 60మందిపై కేసులు పెట్టారన్నారు. రాష్ట్రంలో ఐదు వేల మంది తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కేసులు పెట్టారన్నారు. తల్లి, చెల్లికి అన్నం పెట్టని జగన్ పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటిలను అడ్డకోవడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదన్నారు. ఎట్టిపరిస్థితుల్లో అన్న క్యాంటిన్లు నడిపితీరుతామన్నారు. ఎస్పీ చేతగానితనం వల్ల వైసిపిలో కొందరు రెచ్చిపోయి దాడులకు పాల్పడుతున్నట్లు చెప్పారు. చంద్రబాబు అనుమతివ్వకపోతే జగన్ పాదయాత్ర సాగేదా... అన్నారు. కుప్పంలో తమ పార్టీ చేసిన అభివృద్ధి మినహా ప్రస్తుత జగన్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. మైనింగ్ అక్రమ రవాణా చేస్తూ మంత్రి పెద్దిరెడ్డి, ఎంఎల్‌సి భరత్ టిడిపిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో టిడిపి సత్తాఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. చిత్తూరు సబ్‌జైల్ వద్ద టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.










