Oct 04,2023 22:00

ఫౌండేషన్‌ స్టోన్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

* 700 మందికి ఉపాధి కల్పన
* కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌
ప్రజాశక్తి - శ్రీకాకుళం: 
జిల్లాలో ఎన్‌ఎసిఎల్‌ ఆధ్వర్యాన మరో పరిశ్రమ ఏర్పాటు కానుందని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ తెలిపారు. రణస్థలం మండలం నారువ వద్ద 57 ఎకరాల్లో రూ.200 కోట్లతో ఈ పరిశ్రమను నిర్మించనున్నారని వెల్లడించారు. ఈ పరిశ్రమకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తాడేపల్లిలో తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో బుధవారం శంకుస్థాపన చేశారు. కలెక్టరేట్‌ నుంచి ఎన్‌ఎసిఎల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కె.శేషగిరిరావుతో కలిసి కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు. పరిశ్రమ ఫౌండేషన్‌ స్టోన్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ పరిశ్రమ ఏర్పాటుతో ప్రత్యక్షంగా 200 మందికి, పరోక్షంగా 500 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. విశాఖలో నిర్వహించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం మేరకు ఈ పరిశ్రమ ఏర్పాటు కానుందని చెప్పారు. ఎన్‌ఎసిఎల్‌ డైరెక్టర్‌ వరదరాజులు మాట్లాడుతూ జీవ సంబంధ పదార్థాలతో ఆర్గానిక్‌ ఎరువులను ఇక్కడ తయారు చేయనున్నామన్నారు. అంతర్జాతీయ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో దీన్ని నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. రానున్న ఏడాదిన్నర కాలంలో దీని నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం డిప్యూటీ డైరెక్టర్‌ ఉమామహేశ్వరరావు, ఎపిఐఐసి జోనల్‌ మేనేజర్‌ యతిరాజులు, నాగార్జున అగ్రికమ్‌ లిమిటెడ్‌ ఐఆర్‌ హెడ్‌ కె.శ్యామ్‌ప్రసాద్‌, డిజిఎంలు వర్మ, వి.గోవింద్‌ తదితరులు పాల్గొన్నారు.