May 20,2023 22:21

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ గౌతమి

         అనంతపురం కలెక్టరేట్‌ : జిల్లాలో కొత్తగా మరో మూడు ఇసుక రీచ్‌లను గుర్తించి, వాటికి ఆమోదం తెలిపినట్లు కలెక్టర్‌ ఎమ్‌.గౌతమి తెలిపారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో పామిడి మండల కేంద్రం, గార్లదిన్నె మండలంలో ఇల్లూరు గ్రామం, కంబదూరు మండలంలో కర్తనపర్తి గ్రామంలో గుర్తించిన బహిరంగ ఇసుక రీచ్‌లకు ఆమోదం తెలిపామన్నారు. ఇందుకు సంబంధించి పర్యావరణ అనుమతులన్నింటినీ త్వరగా తీసుకోవాలని, వీలైనంత త్వరగా ఇసుక తవ్వకాలను చేపట్టాలని మైనింగ్‌ అధికారులను ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే సాధ్యమైనంతమేర ఇసుకను నిల్వ ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాలు, తదితర అవసరాలకు ఇసుక కొరత రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో సెబ్‌, మైనింగ్‌ అధికారులు క్రమం తప్పకుండా ఇసుకరీచ్‌ల్లో తనిఖీలు నిర్వహించాలన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో జిల్లాలోని ఇసుక రాష్ట్ర సరిహద్దులు దాటకుండా తగినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా మైనింగ్‌ శాఖ అధికారి జి.వెంకటేశ్వర్లు, తాడిపత్రి డివిజనల్‌ అధికారి నాగయ్య, గ్రౌండ్‌ వాటర్‌ డిడి తిప్పేస్వామి, డిపిఒ ప్రభాకర్‌ రావు, ఐబి డివిజన్‌ ఈఈ సి.ప్రతాప్‌, సెబ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇన్స్‌పెక్టర్‌ ఇ.నరసానాయుడు, ఆర్టీవో బి.సురేష్‌ నాయుడు, పొల్యూషన్‌ బోర్డ్‌ అధికారి శంకరరావు, అసిస్టెంట్‌ జియాలజిస్ట్‌ రామకృష్ణ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.