జిల్లాలో మహిళా మార్టులు
నాలుగు మండలాల్లో ప్రయోగాత్మకం
తరువాత జిల్లా వ్యాప్తంగా
డ్వాక్రా మహిళలకు ఆర్థిక చేయూత
సన్నాహాలు చేస్తున్న డిఆర్‌డిఎ
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి
డ్వాక్రా సంఘాల్లోని మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు డిఆర్‌డిఎ సన్నాహాలు చేస్తోంది. వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మండలానికి ఒక మహిళా మార్టును ఏర్పాటు చేయనున్నారు. తొలివిడతగా జిల్లాలలో నాలుగు మండలాల్లో దీన్ని ప్రయోగ్మాకంగా అమలు చేయనున్నారు. దాని ఫలితాలను తీసుకుని తరువాత జిల్లా వ్యాప్తంగా ఇలాంటి మార్టులను ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఇది వరకే చిత్తూరులో మెప్మా ద్వారా అమలు చేస్తున్నారు. ఇదేవిధంగా మండల కేంద్రాల్లోనూ డిఆర్‌డిఎ ద్వారా తీసుకురానున్నారు.
మన జిల్లాలో 11వేలకు పైగా డ్వాక్రా సంఘాలున్నాయి. వాటిల్లో 1.20 లక్షల మంది సభ్యులున్నారు. మండల స్థాయిలో మండల సమాఖ్య, జిల్లా స్థాయిలో జిల్లా సమాఖ్యలున్నాయి. ఆయా మండలాల పరిధిలో మహిళా మార్టులను ఏర్పాటు చేయాలని డిఆర్‌డిఎ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా రూ.60లక్షల నుంచి కోటి రూపాయలతో మహిళా మార్టులను ఏర్పాటు చేయనున్నారు. వీటిల్లో సామాన్యులకు అందుబాటులో ఉండేవిధంగా అన్నిరకాల వస్తువులు, వంటింటికి కావాల్సిన వస్తువులన్నింటినీ అందుబాటులో ఉంచనున్నారు. ఇలా జిల్లాలో నాలుగు మార్టులను ఏర్పాటు చేయనున్నారు. వాటిని కుప్పం, పుంగనూరు, సదుం, బంగారుపాళ్యం వంటి మండలాల్లో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడ వచ్చే ఫలితాల ఆధారంగా జిల్లాలో ఉన్న 31 మండలాల్లోనూ వీటిని తీసుకురానున్నారు.
స్థలాల కోసం అన్వేషణ..
ఒక్కో మండలంలో అక్కడున్న మండల సమాఖ్య ద్వారా దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందలో భాగంగా అక్కడున్న సభ్యులు ఒక్కోక్కరూ కొంత సొమ్మును వాటాధనంగా సమకూర్చనున్నారు. తొలుత మహిళా మార్టును రిజిస్టర్ చేసి దాన్ని ఆ అకౌంటుకు జమ చేస్తారు. ఇలా వచ్చి డబ్బులను సమకూర్చుకుని భారీ ఎత్తున మహిళా మార్టులను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న మండలాల్లో మార్టుల ఏర్పాటు కోసం కావాల్సిన నిధులు, స్థలాల కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే వీటిని ప్రారంభించి మహిళల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
మహిళల ఆర్థిక సహకారం కోసం
మహిళల ఆర్థికంగా నిలదొక్కుకుని వారిని ఉన్నత స్థాయిలో నిలబెట్టేందుకు డిఆర్‌డిఎ ద్వారా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగానే జిల్లాలో నాలుగు మండలాల్లో మహిళా మార్టులను తీసుకొస్తున్నాం. - తులసి, డిఆర్‌డిఎ పిడి










