Oct 25,2023 20:35

వినతిపత్రం సమర్పిస్తున్న సిపిఎం నాయకులు

వినతిపత్రం సమర్పిస్తున్న సిపిఎం నాయకులు
జిల్లాలో కరువు మండలాలను ప్రకటించాలి
-సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌
ప్రజాశక్తి-నెల్లూరు:జిల్లాలో కరువు మండలాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రకటించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ను కలిసి ఇటీవల జిల్లా సమగ్రాభివృద్ది కోరుతూ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్రలు నిర్వహించిన సమయంలో వారి దృష్టికి వచ్చిన పలు అంశాలు, సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ మాట్లాడుతూ జిల్లా సమగ్రాభివృద్దిని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్రలు రామాయపట్నం, ఉదయగిరి, పొదలకూరు మూడు ప్రాంతాల నుంచి నిర్వహించగా అనేక అంశాలను ప్రజలు తమ ముందుకు తీసుకొచ్చారని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ అన్నారు.
వాటన్నింటిని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. జిల్లాలో సకాలంలో వర్షాలు కురవకపోవడంతో , మరో ప్రక్క ప్రాజెక్టులలో నీరు లేకపోవడంతో కరువు మండలాలు అధికంగా ఉన్నాయన్నారు.ఉలవపాడు,గుడ్లూరు,కందుకూరు, లింగసముద్రం, ఒలేటివారి పాళెం, కొండాపురం, కలిగిరి, జలదంకి, సైదాపురం, రాపూరు, ఉదయగిరి, సీతారామపురం, వింజమూరు దుత్తలూరు, మర్రిపాడు తదితర ప్రాంతాల్లో రైతులు పంటసాగుబడి చేసేందుకు అవసరమైన నీరు లేకపోవడంతో బీడువారిపోయాయన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జిల్లా వ్యాప్తంగా విచారణ చేసి కరువు మండలాలను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. వీటితోపాటు జిల్లాలోని పలు సమస్యలు ముఖ్యంగా సోమశిల ప్రాజెక్టుకు చెందిన అఫ్రాన్‌ మరమ్మత్తులకు గురై ఏడాది పూర్తి కావస్తున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కనిపించలేదన్నారు.ఈ పనులు నిర్వహించేందుకు వంద కోట్లకు టెండర్‌ను సొంతం చేసుకొని పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్‌కు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో పనులు మద్యలో వదిలి వెళ్ళిపోయారన్నారు. వర్షాలు కురిసి ప్రాజెక్టుకు నీరు వస్తే రక్షణ కవచం అయిన అఫ్రాన్‌ మరమ్మత్తులకు గురైన కారణంగా ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. అటువంటి ప్రమాదం ఏదైనా చోటు చేసుకుంటే జిల్లా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. సోమశిల హైలెవల్‌ కెనాల్‌ కింద నాలుగు మండలాలు వింజమూరు,దుత్తలూరు, మర్రిపాడు తదితర ప్రాంతాలకు సాగునీరు, త్రాగు నీరు సరఫరాకు ఉపయోగపడుతుందని, ప్రభుత్వం నిధులు కేటాయించి నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. అదే విధంగా సోమశిల ఉత్తర కాలువు వెడల్పు చేసి రాళ్లపాడు ప్రాజెక్టు కు నీరు అందించగలిగితే పూలేటి వారిపాళెం, లింగసముద్రం, కొండాపురం,కలిగిరి ప్రాంతాల్లో పంటలు పండేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయన్నారు. ఈ పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించాలన్నారు. రామయపట్నం పోర్టు నిర్మాణ పనులకు ప్రభుత్వం రైతుల నుంచి భూమి తీసుకొని సరైన నష్టపరిహారం అందజేయలేదని, 2013 భూ సేకరణ చట్టాని అనుసరించి ప్రభుత్వం రైతులకు అందజేయాల్సిన నష్టపరిహారం అందజేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఈ నెల 31వ తేదిన కలెక్టరేట్‌ ఎదుట ఆ ప్రాంత రైతాంగం ఆందోళన చేయనున్నట్లు తెలిపారు. క్రిష్ణాపట్నం, రామాయపట్నం ప్రాంతాల్లో స్థానికంగా ఉన్న యువతకు వందకు డెబ్బైయైదు శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించి పరిష్కారం చూపని పక్షంలో ఆందోళన చేసేందుకు సిపిఎం సిద్దమౌతుందన్నారు. భోగోలు మండలంలో ఇంజన్లు తయారు చేసే పరిశ్రమ మూతపడి ఉందని, ఆ పరిశ్రమను తెరిపించేందుకు ప్రభుత్వం, జిల్లా అధికారులు కృషి చేయాలన్నారు.ఆత్మకూరు పరిశ్రమల స్థాపనకు భూసేకరణ చేశారని, ఇప్పటి వరకు పరిశ్రమలు స్థాపించిన పాపాన పోలేదన్నారు. మెట్ట ప్రాంతాల్లో ఉన్న యువత ఉపాధి నిమిత్తం చెన్నరు, బెంగుళూరు, హైదరాబాదు తదితర నగరాలకు వలస పోతున్నారన్నారు. వెంటనే ఆ ప్రాంతంలో పరిశ్రమలను స్థాపించి యువతకు ఉపాధి కల్పించాలన్నారు. ప్రధానంగా ఎస్‌సి,ఎస్‌టి వర్గాలు జీవిస్తున్న ప్రాంతాల్లో స్మశాన వాటికలు లేవని, వారికి భూములు లేవని, ల్యాండ్‌ పర్చేజి పథకం కింద కొనుగోలు చేసి భూ పంపిణీ చేయాలన్నారు. ముత్తుకూరు మండల పరిధిలోని నక్కలకాలువ ప్రాంతం , వెంకటాచలం వంటి మునక ప్రాంతాల్లో కలువుల్లో పూడిక తీసి అక్కడ ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. బండేపల్లి ప్రాంతంలో ఉన్న కాలువ ఆధునీకరణ పనులు చేపట్టాలన్నారు. రాబోవు కాలంలో జిల్లాలో పరిశ్రమలు స్థాపించి, రైతులు పంటలు పండించుకొనేందుకు అనుకూల వాతావరణం కల్పించి పారిశ్రామికంగా అభివృద్ది చేస్తే యువతకు ఉపాధి అవకాశాలు, రైతుల సమస్యల పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమస్యలన్నింటి సాధించుకొనేందుకు సిపిఎం ఆధ్వర్యంలో జిల్లాలో దశల వారీ పోరాటానికి సిద్దపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మాజీ జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్‌, నాయకులు మాదాల వెంకటేశ్వర్లు, జి.నాగేశ్వరరావు, ఎం.పుల్లయ్య, ఎస్‌కె రెహనాబేగం, ఎస్‌కె మస్తాన్‌భీ, కత్తి శ్రీనివాసులు, అల్లాడి గోపాల్‌, కొండా ప్రసాద్‌, జి.శేషయ్య, టి.వి.వి. ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.