Oct 02,2023 22:22

పలాస : మాకన్నపల్లిలో వీరస్వామి ఇంటి వద్ద ఎన్‌ఐఎ అధికారులు

* ఏడుచోట్ల సోదాలు
* కరపత్రాలు, సాహిత్యం స్వాధీనం
* 25న హైదరాబాద్‌కు రావాలని నోటీసులు జారీ
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌, పలాస, వజ్రపుకొత్తూరు, టెక్కలి రూరల్‌: 
జిల్లాలో సోమవారం పలుచోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) సోదాలు నిర్వహిస్తుందన్న వార్తలు కలకలం రేపాయి. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న పౌర హక్కులు, ప్రజా సంఘాలు, అమరవీరుల బంధుమిత్రుల కమిటీ నాయకుల ఇళ్లల్లో దర్యాప్తు సంస్థ అధికారులు తనిఖీలు జరిపారు. పోలీస్‌ బందోబస్తుతో అధికారులు రావడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. తనిఖీలు ముగిసే వరకూ ఇళ్ల వద్ద సాయుధ పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించారు. సోదాల్లో భాగంగా కొన్ని పుస్తకాలు, సాహిత్యం, కరపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 25న హైదరాబాద్‌ నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ కార్యాలయానికి హాజరుకావాలని అందరికీ నోటీసులు జారీ చేశారు.
శ్రీకాకుళం జిలా కేంద్రం శివారుల్లో ఉన్న ముచ్చువానిపేటలో నివాస ముంటున్న కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఉపాద్యాయుడు మిస్క కృష్ణయ్య, బొందిలీపురంలో నివాస ముంటున్న పౌరహక్కుల సంఘం రాష్ట్ర నాయకులు, న్యాయవాది కిలారు ఈశ్వరరావు, పాండురంగ వీధిలో నివాస ముంటున్న మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు కె.వి.జగన్నాథరావు ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఇళ్లల్లో కేంద్ర బలగాలకు చెందిన సిబ్బందితో కలిసి ఈ సోదాలు చేపట్టారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి దేశవ్యాప్త నిషిద్ధ సంస్థగా ఉన్న సిపిఐ మావోయిస్టు పార్టీతో సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఈ సోదాలు జరిపారు. మానవ హక్కుల వేదిక నాయకులు జగన్నాథరావు ఇంట్లో జరిపిన సోదాల్లో ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో వెనుదిరిగారు. మిగిలిన చోట్ల కరపత్రాలు, సాహిత్యన్ని స్వాధీనపర్చుకున్నారు. ఎన్‌ఐఎ అధికారులు వారి సెల్‌ఫోన్లను స్వాధీనపర్చుకున్నారు. వారిని విచారించిన అనంతరం ఈనెల 2న హైదరాబాద్‌లో ఉన్న ఎన్‌ఐఎ ప్రాంతీయ కార్యాలయంలో హాజరు కమ్మని లిఖితపూర్వకమైన నోటీసులు అందజేశారు.
పలాస మండలం మాకన్నపల్లికి చెందిన పౌరహక్కుల నేత సాలిన వీరాస్వామి ఇంట్లో ఎన్‌ఐఎ అధికారుల బృందం సోదాలు నిర్వహించారు. వీరి సోదాల్లో ఉపా కరపత్రాలు మాత్రమే లభ్యం కావడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పౌరహక్కుల నేత సాలిన వీరాస్వామి మాట్లాడుతూ తాను సాధారణ రైతు కూలీనని, తన ఇంట్లో ఎన్‌ఐఎ అధికారులు సోదాలు చేయడాన్ని ప్రతిఒక్కరూ ఖండించాలని కోరారు. వజ్రపుకొత్తూరు మండలంలోని అక్కుపల్లి, గడూరు గ్రామాల్లోని అమరవీరుల బంధుమిత్రుల కమిటీ సభ్యులు ఇళ్లల్లోనూ ఎన్‌ఐఎ బృందాలు సోదాలు నిర్వహించారు. ఉదయం ఆరుగంటలకు అక్కుపల్లికి చెందిన బంధుమిత్రులు కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మడ్డు ధనలక్ష్మి, మరో రాష్ట్ర సభ్యులు గడూరుకు చెందిన జోగి కోదండరావు ఇళ్లకు చేరుకున్నారు. ఇద్దరు ఇళ్లల్లోనూ నాలుగు గంటల పాటు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో వివిధ సాహిత్య పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ఉదయం ఆరు గంటలకు వజ్రపుకొత్తూరు పోలీసుల సహకారంతో వీరు ఇళ్లకు ఒకే సమయంలో చేరుకున్నారు. ఒక్కసారిగా పోలీసులు బృందాలు గ్రామాలకు రావడంతో గ్రామస్తులు సైతం ఆందోళనలు చెందారు. అక్కుపల్లి మడ్డు ధనలక్ష్మి ఇంటికి చేరుకున్న సమయానికి ఆమె ఆనారోగ్యంతో మంచంపై పడుకొని ఉన్నారు. బృందం సభ్యులు ఇంట్లోకి వచ్చి పరిచయం చేసుకొని తనిఖీలు చేస్తామని చెప్పి సోదాలు ప్రారంబించారు. ఇంటిలో ఉన్న బీరువాలు, అన్ని గదులు, మంచాలు, చివరకు వంట సామగ్రినీ తనిఖీలు చేపట్టారు. ఇంట్లో ఉన్న పుస్తకాలు పరిశీలించారు. అందులోని దండకారణ్యం, మై తుజే సలాం. నజ్సలబరి, శబ్దం, ప్రజాకళలు మొత్తం ఐదు పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. జోగి కోదండరావు ఇంటి నుంచీ కొన్ని పుస్తకాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అనంతరం తాము స్వాధీనం చేసుకున్న పుస్తకాల వివరాలకు సంబంధించి రసీదులు అందించారు. అమరవీరుల బంధుమిత్రుల కమిటీ కార్యకలాలపై పలు ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టారు.
టెక్కలి మండలం తొలుసూరుపల్లి పంచాయతీ మున్సబ్‌పేటలో కులనిర్మూలన పోరట సమితి జిల్లా అధ్యక్షులు బెలమర ప్రభాకరరావు ఇంట్లో ఎన్‌ఐఎ సోదాలు నిర్వహించారు. ఈ సోదాలో కుల నిర్మూలన పోరాట సమితి బ్యానరు, లెటర్‌ ప్యాడ్‌, సెల్‌ఫోన్‌, దళితులు తరుపున ఫిర్యాదు చేసిన దరఖాస్తులు సీజ్‌ చేసినట్లు సమాచారం. అయితే ఇటీవలన అంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభాకరరావు అరెస్టు చేయడం పాఠకులకు విదితమే. ఏమైనా మావోయిస్టులతో సత్సంబంధాలు ఉన్నాయని అనుమానంతో ఈ సోదాలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ నెల 25న హైదరాబాద్‌ నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ కార్యాలయానికి హాజరుకావాలని నోటీసులు ఇచ్చారని ప్రభాకరరావు తెలిపారు.
ఆందోళన చెందా
ఉదయం ఆరు గంటకే పోలీసు బృందాలు ఇంటికి రావడంతో ఆందోళనకు గురయ్యాం. తాను సుగర్‌, బిపి లాంటి దీర్ఘకాలి వాధులతో బాధపడుతున్నాను. ఒక్కసారిగా ఎన్‌ఐఎ బృందన సభ్యులు ఇంట్లోకి ప్రవేశించి ఇంటిలో శోదాలు చేస్తామని చెప్పడంతో తాము అందకు అంగీకరించాం. సోదాలు చేసి ప్రచురణ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఏ ఒక్క పుస్తకమూ నిషేధిత పుస్తకం కాదన్నారు. తన భర్త మడ్డు ధనరాజు బూటకు ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. నా భర్త మృతదేహాన్ని చివసారిగా చూడలేకపోయాను. ఇలాంటి బాధలు మరే ఒక్కరు పడకూడదనే తాము అమరవీరుల బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర సభ్యులుగా పనిచేస్తున్నాను.
- మడ్డు ధనలక్ష్మి, అమరవీరుల బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర సభ్యులు, పలాస