జిల్లాలో ఎల్లో అలర్ట్ మరో 48 గంటలు అప్రమత్తం పారిశుధ్య నిర్వహణపై దృష్టి సారించండి టెలికాన్ఫరెన్స్‌లో కలెక్టర్
జిల్లాలో ఎల్లో అలర్ట్
మరో 48 గంటలు అప్రమత్తం
పారిశుధ్య నిర్వహణపై దృష్టి సారించండి
టెలికాన్ఫరెన్స్‌లో కలెక్టర్
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: జిల్లాలో ఎల్లో అలర్ట్ కలదని, మరో 48గంటలు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్ తెలిపారు. ఆదివారం జిల్లాలో మాండూస్ తుపానుకు సంబంధించి వివిధశాఖల జిల్లా అధికారులు, ఆర్డీఓలు, తహశీల్దార్‌లు ఎంపీడీఓలతో క్షేత్రస్థాయి పరిస్థితులపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్, డిఆర్‌ఓ ఎన్.రాజశేఖర్‌తో కలిసి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎల్లో అలర్ట్ కలదని, మరో 48 గంటలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కలదని తెలిపారు. భూమి తడిగా ఉన్నందున వర్షంపడిన వెంటనే నీటిప్రవాహం ఎక్కువ అవుతుందని వంకలు, వాగులలో నీటిప్రవహ సామర్థ్యంపై నిఘా ఉంచాలన్నారు. వంకలు, వాగులు ప్రజలు దాటే ప్రయత్నం చేయకుండా పోలీసు వారి సహకారంతో తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. వివిధ సంబంధింత శాఖల జిల్లా, డివిజన్, మండలాల, సచివాలయం స్థాయిలో అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి పంటనష్టంను అంచనా వేయాలన్నారు. అలాగే రోడ్డు, చెరువులు, ఇతర నష్టాలకు సంబంధించిన నివేదికను ఆదివారం సాయంత్రం లోపు పంపాలని ఆదేశించారు. వర్షం కారణంగా ఎక్కడైనా విద్యుత్తు కనెక్షన్‌లకు అంతరాయం ఏర్పడితే వెంటనే విద్యుత్ కనెక్షన్లను పునరు ద్ధరించాలని ఏపీ ఎస్పీడీసీఎల్ అధికారులను, ఎన్టీఆర్ జలాశయం కృష్ణాపురం, వాగులు వంకలు, చెరువులు వద్ద ఎప్పటికప్పుడు నీటిసామర్థ్యంకు సంబంధించి నిఘాను పెంచాలని ఇరిగేషన్ ఎస్‌ఈని పంటనష్టం సంబంధించి వ్యవసాయ, ఉద్యానవన, సిరికల్చర్ శాఖల అధికారులు అంచనాలను సిద్ధంచేయాలన్నారు. వ్యవసాయ, ఉద్యానవన సిరికల్చర్ అధికారులను, వర్షం తగ్గిన వెంటనే పారిశుద్ధ్యం మెరుగుపరచాలని, ప్రజలకు క్లోరినేషన్ చేసిన తరువాత తాగునీరుని సరఫరా చేయాలన్నారు. ప్రజలకు సరఫరా చేసే తాగునీటిని పరీక్ష చేయాలని ఎస్‌ఈఆర్‌బ్ల్యూఎస్ అధికారులను, ప్రజలకు సురక్షిత మంచినీటి సరఫరాపై దృష్టి సారించాలని డిపిఓను, మున్సిపల్ కమిషనర్లను, ప్రజలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే వైద్య ఆరోగ్యశాఖ క్షేత్రస్థాయిలో ప్రజలకు వైద్యసేవలు అందించాలని డిఎంఅండ్‌హెచ్‌ఓను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పున రావాస కేంద్రాలకు తరలించి వారికి అన్ని వసతులు కల్పించాలనన్నారు. శాఖలవారీగా తీసుకుంటున్న చర్యలను అధికారులు కలెక్టర్‌కు వివరించారు.










