Nov 15,2022 23:24

ఇటీవల విద్యుత్‌ షాకుతో మృతి చెందిన ఏనుగు (ఫైల్‌)

జిల్లాలో భారీగా పెరిగిన
ఏనుగులు
నిత్యం పంటలు ధ్వంసం
గజదాడుల్లో పెరిగిన మరణాలు
ఎప్పటికప్పుడు స్పందిస్తున్న ప్రభుత్వం
కందకాలు, విద్యుత్‌ కంచేలను
ఏర్పాటు చేస్తున్న అటవీశాఖ
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
చిత్తూరు జిల్లాలో మొత్తం అడవులు 29శాతం మేర విస్తరించి 1.95 లక్షల హెక్టర్లలో ఉన్నాయి. ఇందులో 353 చదరపు కిలోమీటర్లు కౌండిన్య రాయల్‌ ఎలిఫెంట్‌ జోన్‌ను ఏర్పాటు చేసి ఏనుగులను సంరక్షిస్తున్నారు. జిల్లాలో సుమారు మూడు నియోజకవర్గాల్లో ప్రధానంగా నిత్యం ఏనుగులు సంచరిస్తూ ఆహారం కోసం పంటపొలాల్లోకి రావడంతో రైతులకు ఇబ్బందికరంగా మారింది. అలాగే కుప్పం, పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాలలో ప్రస్తుతం అనధికారిక లెక్కల ప్రకారం భారీ ఎత్తున ఏనుగులు ఉన్నాయని అంచనా.
అడవుల్లో జీవన్మరణ సమస్యతో ఏనుగులు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. దీంతో ప్రజలు వాటిని తిరిగి అడవులలోకి తరిమేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈప్రయత్నాలలో కొంతమంది మరణించడం, అలాగే కొన్ని ఏనుగులు కూడా మరణించడం జరుగుతూనే ఉంది. గత మూడు సంవత్సరాల్లో జిల్లాలో 10 ఏనుగులు మరణించగా, 6 మంది రైతులు మరణించారు. సుమారు 3400చోట్ల పంట నష్టం జరిగింది. ప్రభుత్వం కూడా వెంటనే స్పందిస్తూ ఎప్పటికప్పుడు పరిహారం రైతులకు అందిస్తోంది. అదేవిధంగా మరణించిన వారి కుటుంబాలకు కూడా పరిహారం అందిస్తూ వారి ఆదుకోవడం జరుగుతోంది.
ఏనుగులు అటవీ ప్రాంతం నుంచి బయటకు రాకుండా కాంటూరు కందకాలు తవ్వడం, ఎలక్ట్రిక్‌ ఫెన్సింగ్‌ అటవీశాఖ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటివరకు 70 కిలోమీటర్లకు పైగా సోలార్‌ ఫెన్సింగ్‌ వేయగా మరో 60కిలోమీటర్లు తవ్వడం జరిగింది. ప్రజలను భయాందోళన నుంచి బయటపడేసేందుకు ప్రభుత్వం తగుచర్యలు చేపడుతోంది. ఈనేపథ్యంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ట్రాకర్లను ఉపయోగించి పంటపొలాల వైపు వచ్చిన ఏనుగులను తిరిగి అటవీప్రాంతాల్లోకి ట్రాప్‌ చేయడం నిరంతరంగా జరిగే ప్రక్రియ. మొదట టపాకాయలు పేల్చి బయటకు పంపే ప్రక్రియతో పాటు ట్రాకర్లతో దారి మళ్ళించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంది. తాజాగా అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్ణయం మేరకు పలు ప్రాంతాలలో బేస్‌ క్యాంపులను ఏర్పాటు చేసి ఏనుగుల రాకపోకలను గమనించి రైతులను అప్రమత్తం చేయడానికి తగుచర్యలు తీసుకుంటున్నారు. ఈ క్యాంప్‌ ద్వారా సుమారు 78 కిలోమీటర్ల మేరకు అటవీ ప్రాంతంలో ఏనుగులు వచ్చి కదలికలు గుర్తించే అవకాశం ఉంది దీని ద్వారా ఏనుగులతో పాటు ఇతర జంతువులు కూడా గుర్తించవచ్చు.
చిత్తూరు జిల్లాలోని అటవీ ప్రాంతం అటు కర్ణాటక ఇటు తమిళనాడు ప్రాంతాలతో కలిసి ఉండడం వలన అటువైపు నుంచి కూడా ఏనుగులు చిత్తూరుజిల్లా వైపు వస్తుంటాయి. సత్యమంగళం ఫారెస్ట్‌ ప్రాంతం నుంచి కూడా చిత్తూరు జిల్లాలోకి భారీ ఎత్తున ఏనుగులు వస్తున్నాయని ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం అందుతోంది. ఇటీవల మంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జంతువుల వల్ల జరిగే పంటల నష్టాన్ని తగ్గించాలని, నష్టపరిహారాన్ని పెంచేలా ప్రభుత్వానికి నివేదిక పంపారు. కొత్తధరల ప్రకారం పరిహారం ఇవ్వాలని ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. అదేవిధంగా అదేవిధంగా జాతీయ విపత్తు కింద ప్రకటించేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరడం జరిగింది.
పొలానికి వెళ్లాలంటే భయం వేస్తోంది..
- యాగమూర్తి, గాండ్లపల్లి, మొగిలిగ్రామం,
బంగారుపాల్యం మండలం
మా గ్రామం కౌండిన్య ఎలిఫెంట్‌ జోన్‌ప్రాంతం పక్కన ఉంటుంది. గ్రామం పక్కనే అటవీ ప్రాంతం ఉండడంతో నిత్యం ఏనుగులు వస్తూనే ఉంటాయి. ఈ ఏనుగులు రావడం వల్ల పంటపొలాల వైపు వెళ్లడానికి భయపడుతూ ఉన్నాం. పంట పొలాలను ధ్వంసం చేయడమేగాక ఒక్కోసారి పంటలను కాపాడుకొనే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వ అధికారులు సకాలంలో స్పందిస్తున్న ఇటీవల కాలంలో ట్రాకర్లకు కూడా ఏనుగులు లోంగడం లేదు. వారు కూడా మరణిస్తున్నారు. విద్యుత్‌కంచే పనులు పూర్తి అయితే ఈ ప్రమాదం నుంచి బయటపడవచ్చు. మంగళవారం ఉదయం కూడా ఒక ఏనుగు గుంపులో వస్తుండగా వ్యవసాయ భావిలో పడిపోయింది. అధికారులు వెంటనే స్పందించి తగుచర్యలు తీసుకోవడం తో గండం గడిచింది. లేదంటే మరికొన్ని రోజుల పాటు ఏనుగుల ఆగ్రహావేశాలు చుడాల్సి వచ్చేది.
మా గ్రామానికి ఏనుగులు అధికంగా వస్తున్నాయి..
- గోవిందరెడ్డి, బేరుపల్లి, పలమనేరు మండలం
మా గ్రామం అటవీ ప్రాంతంలో ఉండడం వల్ల నిత్యం ఏనుగులు వస్తూ పోతూ ఉంటాయి. ఇతర ప్రాంతాల నుంచి కూడా ఏనుగులు వస్తుండడం వల్ల భారీ ఎత్తున మా ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తున్నాయి.
జనవాసాల్లోకి రాకుండా చర్యలు చేపట్టాలి...
- చైతన్యకుమార్‌రెడ్డి, జిల్లా అటవీశ ాఖాధికారి
జిల్లాలో 1.95లక్షల హెక్టార్లలో అటవీ భూములున్నాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీఎత్తున ఏనుగులు వస్తుంటాయి. పంటనష్టం ఇంకా పెంచాలని అటవీశాఖ మంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వద్ద జరిగిన సమీక్షలో చెప్పడంతో వెంటనే ప్రతిపాదనలు పంపాము. అనుమతి రాగానే నూతన ధరలను ఇవ్వడం జరుగుతుంది. పంటల నష్టం, మనుషుల నష్టం జరగకుండా ట్రాకర్‌ల ద్వారా ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాం. ప్రకతి వైపరీత్యాల ద్వారా ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. మంత్రి ప్రత్యేక శ్రద్ధ కారణంగా పలుప్రాంతాల్లో హ్యంగింగ్‌ సోలార్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయడం జరుగుతోంది. మంగళవారం తెల్లవారుజామున బంగారుపాళ్యం మండలంలోని మొగిలి గ్రామంలో ఒక ఏనుగు గుంపులో నుంచి పొరపాటున బావిలో పడడం జరిగింది. అటవీ శాఖ అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ చేసి ఏనుగును తిరిగి గుంపులోకి కలిపేశారు.