జిల్లాలో భారీ వర్షాలు
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్
జిల్లావ్యాప్తంగా భారీవర్షాలు నమోదు అవుతున్నాయని చెరువులు వంకలు, వాగుల పట్ల ఉధతిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ అవసరమైతే క్షేత్రస్థాయిలో సచివాలయ సిబ్బందితో పాటు ఇతరులకు షిఫ్టులవారీగా డ్యూటీలు వేసి ఎటువంటి నష్టం జరగకుండా చూడాలన్నారు. అలాగే స్పందన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సకాలంలో పరిష్కరించేలా చూడాలని, గడపగడపకు వచ్చిన దరఖాస్తులకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఆర్‌డీఓలు, తహశీల్దార్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సకాలంలో స్పందన అర్జీలను పరిష్కరించాలని క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు పర్యటించి సమస్యకు గల కారణాలతో పాటు సమస్య పరిష్కారానికి సంబంధించి నాడు, నేడు ఫోటోలను జతచేయాలన్నారు. అదేవిధంగా తీసుకున్న చర్య గురించి దరఖాస్తుదారునికి తెలపాలని అందుకు రసీదు కూడా ఇవ్వాలని దాంతోపాటు ఫోటోలను అప్లోడ్ చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియ సక్రమంగా నిర్వహించినట్లయితే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించారు. కొన్ని ప్రాంతాలలో ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు భారీగా వస్తున్నాయని రెవెన్యూ సిబ్బంది పూర్తిస్థాయిలో విచారణ జరిపి మంజూరు చేయాలన్నారు.
జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు పడుతున్నాయని ఇప్పటికే పలు చెరువులు వంకలు వాగులు ఉధతంగా ప్రవహిస్తున్నాయని అటువంటి ప్రదేశాలలో ప్రజలను అప్రమత్తం చేయాలని ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా చూడాలని కలెక్టర్ అన్నారు. గ్రామ సచివాలయాలం నుంచి అందరూ అధికారులు అప్రమత్తంగా ఉండి క్షేత్రస్థాయిలో అవసరమైన చోట వంతుల వారీగా పని చేయాలన్నారు. ఎక్కడైనా ఆపద వస్తే వెంటనే ఆ ప్రాంతంలోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి సహాయక శిబిరాలను ఏర్పాటు చేయాలని అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు మండల స్థాయి అధికారులు చేయాలన్నారు. ఏటువంటి పరిస్థితుల్లోనూ నష్టం జరగకుండా అందరూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, జిల్లారెవెన్యూ అధికారి ఎన్.రాజశేఖర్‌లు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు
జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో వంకలు, వాగులు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయని జిల్లాలోని అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని అందుకోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయమని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమును ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.రాజశేఖర్ తెలిపారు. ఇప్పటికే భారీ వర్షాలు కురిసాయని మరో మూడు రోజులు పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కంట్రోల్ రూమ్ నెంబర్ 9491077325 అని, జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడ్డ వెంటనే తగుచర్యల కోసం ఈ నెంబర్‌ను సంప్రదించవచ్చునని డిఆర్‌ఓ తెలిపారు.










