Oct 25,2022 20:51

జిల్లాలో 699 గ్రామాల్లో డ్రోన్‌ సర్వే పూర్తి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:

జిల్లాలో రిసర్వే పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఇప్పటివరకు 124 గ్రామాలకు సంబంధించి ఆర్‌ఓఆర్‌ పూర్తి అయ్యిందని జిల్లా కలెక్టర్‌ ఎం. హరినారాయణన్‌ తెలిపారు. అలాగే వివిధ ప్రాంతాల్లో నిర్మించతలపెట్టిన రిజర్వాయర్లకు, జాతీయ రహదారులకు భూసేకరణ పనులు వేగవంతం చేయాలన్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ మందిరం నుంచి ఎడి సర్వే, ఆర్డీవోలు, తహశీల్దార్లు, డిఐలు, మండల సర్వేయర్లు, గ్రామసచివాలయ ఉద్యోగులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 699 గ్రామాలకు సంబంధించి డ్రోన్‌ సర్వే పనులు పూర్తి అయ్యాయని, ఇప్పటివరకు 204 గ్రామాలకు సంబంధించి ఒఆర్‌ఐ షీట్లు రావడం జరిగిందన్నారు. అలాగే 124 గ్రామాలకు డ్రాఫ్ట్‌ ఆర్‌ఓఆర్‌ పనులు పూర్తి అయ్యాయని, 115 గ్రామాలకు సంబంధించి ఫైనల్‌ ఆర్‌ఓఆర్‌ పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. 38గ్రామాలకు సంబంధించి గ్రామ సరిహద్దులను గుర్తించడం జరుగుతుందని 16 గ్రామాలకు సంబంధించి ప్రభుత్వ భూములను గుర్తిస్తున్నారని, మిగతా ప్రాంతాలలో గ్రౌండ్‌ ట్రూ థింగ్‌ వివిధ దశలలో జరుగుతుందని, ప్రస్తుతం జరుగుతున్న వెరిఫికేషన్‌ దాదాపుగా పూర్తి అయిందని క్లరికల్‌ స్థాయిలో మరోసారి చూసుకోవాలని జిల్లా కలెక్టర్‌ తహశీల్దారులను ఆదేశించారు. వెరిఫికేషన్‌ ప్రక్రియలు ఎటువంటి తప్పులు వచ్చిన సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఎటువంటి తప్పులు లేకుండా వెరిఫికేషన్‌ కార్యక్రమంలో గ్రామ సర్వేయర్‌, మండల సర్వేయర్లు, తాసిల్దార్లు ఆర్డీవోలు తగిన జాగ్రత్తలు వహించాలని అన్నారు. జిల్లాలో వివిధ అభివద్ధి పనులలో భాగంగా రిజర్వాయర్లు, జాతీయ రహదారుల పనులకు సంబంధించి భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌, డిఆర్‌ఓ ఎన్‌.రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.