Jun 16,2022 22:17

జిల్లాలో 52 గ్రామాల్లో గ్రౌండ్‌ ట్రూథింగ్‌
రీసర్వే 12 డోన్లతో కంట్రోల్‌ రూమ్‌ నుంచి పర్యవేక్షణ : జెసి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
రాష్ట్ర ప్రభుత్వం రీసర్వే కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అక్టోబర్‌ 2వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి భూహక్కులను పంపిణీ చేయడం జరుగుతుందని, దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని సిసిఎల్‌ఏ ప్రత్యేక కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ అన్నారు. గురువారం మధ్యాహ్నం కార్యదర్శులు సిద్ధార్థజైన్‌, బాబు అహ్మద్‌లతో కలిసి జిల్లాకలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల చివరికి రెండువేల గ్రామాలకు సంబంధించిన ఓఆర్‌ఐ షీట్లు ఇవ్వడం జరుగుతుందని, ఇందుకు సంబంధించిన గ్రౌండ్‌ ట్రూథింగ్‌, గ్రౌండ్‌ వాలిడేషన్‌లతోపాటు 13నోటిఫికేషన్‌ ఇచ్చే కార్యక్రమాలనూ ప్రణాళిక బద్దంగా తయారు చేయాలన్నారు. గ్రౌండ్‌ ట్రూథింగ్‌కు సంబంధించి వీఆర్‌ఓ, గ్రామసర్వేయర్‌, విఆర్‌ఐలు బందంగా ఉండాలన్నారు. ఓఆర్‌ఐ షీట్లు వచ్చిన 15రోజుల లోపున గ్రౌండ్‌ ట్రూథింగ్‌ పూర్తి చేయాలని, ఒక వారంలో వాలిడేషన్‌ నిర్వహించాలన్నారు. అలాగే 30 రోజుల లోపల 13 నోటిఫికేషన్‌ విడుదల చేయాలని, ఆ తర్వాత ఆర్‌ఓఆర్‌ ఒకనెలలో పూర్తి చేయాలన్నారు. తహశీల్దార్‌లు తప్పనిసరిగా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ రీసర్వే కార్యక్రమాన్ని సమీక్షించాలన్నారు. ఆర్‌డిఓలు, జాయింట్‌ కలెక్టర్‌, కలెక్టర్‌లు పర్యవేక్షణ చేస్తూ ఉండాలని ప్రతిరోజూ జరుగుతున్న పనుల గురించి కంట్రోల్‌ రూమ్‌ ద్వారా తెలుసుకోవాలని అన్నారు. తద్వారా ఏమైనా మార్పులు చేయాల్సి ఉంటే వెంటనే తీసుకోవాలన్నారు. అనంతరం భూహక్కు పత్రాలను ప్రింటింగ్‌ కోసం కార్యదర్శి బాబు అహ్మద్‌ను సంప్రదించాలన్నారు. ఈసందర్భంగా కార్యదర్శి బాబు అహ్మద్‌ మాట్లాడుతూ హక్కుపత్రం మొత్తం 8పేజీలు ఉంటుందని వివరాలతో పాటు యజమాని వివరాలు ఉంటాయని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం మ్యుటేషన్‌ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తహశీల్దార్లు ఏటువంటి పెండింగ్‌ లేకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,463 ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయని వీఆర్వోలు తగిన చర్యలు తీసుకునేలా చూడాలన్నారు. చిత్తూరులో కూడా పలు ఫైల్స్‌ పెండింగ్‌లో ఉన్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ కాలపరిమితి లోపే మ్యుటేషన్‌ ప్రక్రియ జరిగేటట్లు తహశీల్దార్లు చూడాలని అన్నారు. ఇందు కోసం ఒక ప్రత్యేక పద్ధతిని వచ్చే సోమవారం నుంచి అమలు అయ్యేలా రూపొందించామని తెలిపారు. ఈప్రక్రియకు సంబంధించి అర్జీదారులకి ఎస్‌ఎంఎస్‌ ఈవిధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని, తపాలా పంపడంలో కూడా తగుజాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ మాట్లాడుతూ జిల్లాలో రెండు పైలెట్‌ గ్రామాల్లో ఈ ప్రక్రియ పూర్తి అయిందని మరో 62 గ్రామాలకు సంబంధించిన ఓఆర్‌ఐ షీట్లు రావడం జరిగిందని వివిధదశల్లో పనులు జరుగుతున్నాయని అన్నారు. ప్రణాళిక ప్రకారం కాలపరిమితి నిర్ణయించుకుని నిర్వహించడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో చిత్తూరు నుంచి డిఆర్‌ఒఒ ఎన్‌.రాజశేఖర్‌, సర్వే ఇన్స్పెక్టర్‌ లత, ఎస్‌డిసి ఫర్వీన్‌ పాల్గొన్నారు.