Jul 16,2022 23:07

జెడ్పి సర్వసభ్య సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి

జెడ్పి సర్వసభ్య సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి
ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్‌

జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. జిల్లా పరిషత్‌ సమావేశమందిరంలో జడ్‌పి సర్వసభ్య సమావేశం ఛైర్మన్‌ గోవిందప్ప శ్రీనివాసులు అధ్యక్షతన శనివారం జరిగింది. మంత్రి ప్రారంభోపన్యాసం చేస్తూ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. తొలుత జలవనరుల శాఖ ద్వారా జరుగుతున్న ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు సంబంధించి తవణంపల్లి మండలం మాధవరం గ్రామం వద్ద కష్ణసాగరం చెరువు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎస్‌ఈ ని ఆదేశించారు. కుప్పం గంగమ్మ శిరస్సువంక, వి.కోట వద్ద కైగల్‌ రివర్‌ వద్ద, కుప్పం మండలం మంజలమడుగు, వి.కోట మండలం వద్ద గంగమ్మ యేరు వద్ద నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు. పిటిఎం మండలం వద్ద వ్యాసరాయ సముద్రం చెరువులు మొరవ పనులను చేపట్టాలని, జిల్లాలో 7,660 చెరువులలో దాదాపు 50 శాతం నీటి నిల్వ సామర్థ్యం కలదని, మీడియం ప్రాజెక్ట్‌ లలో కూడా 75 శాతం నీటి నిల్వ సామర్థ్యం కలదని తెలిపారు. జిల్లాలో గతంలో కొనుగోలు చేసి నిరుపయోగంగా ఉన్న వ్యవసాయ పనిముట్లను వినియోగం లోకి తీసుకురావాలని వ్యవసాయ శాఖాధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి జరిగే సామాజిక తనిఖీని సంబంధిత శాఖ డైరెక్టర్లు క్షేత్ర స్థాయిలో పరిశీలించేలా ఆదేశాలిచ్చామని తెలిపారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు సంఘాలలో తీసుకున్న రుణాలను తిరిగి సక్రమంగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ భవనాల నిర్మాణానికి సంబంధించి ఎలాంటి కొరత లేదని, స్థానికంగా ఉన్న వాగులు, వంకల్లో ఇసుకను సచివాలయం ఉచితంగా తీసుకోవచ్చునని తెలిపారు.
పట్టభద్రుల ఎంఎల్‌సి యండపల్లి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ జగనన్న కాలనీల్లో భాగంగా మంజూరు చేసిన ఇళ్లకు ప్రభుత్వం ఇచ్చే నిధులను పెంచాలన్నారు. నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మారాయని, భద్రత నిమిత్తం వాచ్‌మెన్‌లను ఏర్పాటు చేయాలన్నారు. జెడ్‌పిటిసిలను హాస్పిటల్‌ డెవలప్మెంట్‌ కమిటీలలో ఎక్స్‌ అఫీషియో మెంబెర్‌లుగా నియమించాలని చేసిన ప్రతిపాదనలను మంత్రి వర్యులు, జిల్లా కలెక్టర్‌ అంగీకరించారు. తద్వారా జెడ్‌పిటిసిలు వారి పరిధిలో ఉన్న హాస్పిటల్‌ కమిటీలలో సభ్యులుగా కొనసాగనున్నారు.
సత్యవేడు ఆరూరు గ్రామం లో చదివే పిల్లలు తమిళ మీడియంలో చదివేందుకు చాలా దూరం ప్రయాణించ వలసి ఉందని, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఇరగలం హై స్కూల్‌లో ఒక తమిళ టీచర్‌ ను నియామకం చేయాలని జెడ్‌ పిటిసి కోరగా అందుకు తగు చర్యలు తీసుకుంటామని డిఇఒ హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో చిత్తూరు ఎంపి ఎన్‌. రెడ్డెప్ప, జిల్లా కలెక్టర్‌ హరినారాయణన్‌, చిత్తూరు, తంబళ్లపల్లి, సత్యవేడు శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు, ద్వారకానాథ రెడ్డి, ఆదిమూలం, ఎంఎల్‌సి భరత్‌, జడ్‌పి సిఇఒ ప్రభాకర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ రామచంద్రారెడ్డి, పలమనేరు, కుప్పం, మదనపల్లి పట్టణాభివద్ధి సంస్థ చైర్మన్‌ వెంకట్‌ రెడ్డి యాదవ్‌, డిఎఫ్‌ఓ ఈస్ట్‌ చైతన్య కుమార్‌ పాల్గొన్నారు.
పెద్దిరెడ్డి విమర్శించే అర్హత టిడిపికి లేదు : జడ్‌పి ఛైర్మన్‌
ప్రజల మనిషి రాష్ట్ర మంత్రి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులను విమర్శించే అర్హత టిడిపి నాయకుడు కిషోర్‌ కుమార్‌ రెడ్డికి లేదని చిత్తూరు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం చిత్తూరు జడ్పీ ఛాంబర్‌ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రిపై నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి ఎర్రచందనం మాఫియా అని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. పెద్దరెడ్డి కుటుంబాన్ని విమర్శస్తే తాటా తీస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్‌ పాలనలో ముఖ్యమంత్రిగా తన అన్న కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఉన్నప్పుడు కిషోర్‌ కుమార్‌ రెడ్డ విచ్చలవిడిగా ఎర్రచందనం తరలించారన్నారు. అదేవిధంగా కుప్పం నియోజకవర్గంలో గత తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన మైనింగ్‌ మాఫియా ప్రస్తుతం కూడా ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గంలో వైసిపి జెండా ఎగరేస్తామన్నారు. కుప్పంలో చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు.