అనంతపురం కలెక్టరేట్ : జిల్లాలో రహదారులపై ప్రత్యేక దృష్టితీసుకుని అన్ని విధాలా వాహనరాకపోకకు సౌకర్యవంతండా ఉండేలా వాటిని తీర్చిదిద్దాలని కలెక్టర్ ఎమ్.గౌతమి అధికారులను అదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌లో రహదారుల నిర్వహణపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్ల నిర్మాణాలతో పాటు ప్రధాన కూడళ్ల వంటి అవకాశం ఉన్న ప్రదేశాల్లో సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు. జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పనులు త్వరితగతిన చేపడతామని హామీ ఇచ్చారు. ఒక శాఖకు సంబంధించిన రోడ్లపై మరో శాఖ తవ్వకాలు చేపట్టినప్పుడు త్వరితగతిన మరమ్మతులు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బి ఎస్‌ఈ ఓబుల్‌రెడ్డి, జాతీయ రహదారుల అథారిటీ అధికారులు పాల్గొన్నారు.










