Apr 12,2023 20:51

జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి
ప్రజాశక్తి - భీమవరం
జిల్లా అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు తోడ్పాటునివ్వాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన సిఎస్‌ఆర్‌ ఫండ్స్‌ వినియోగంపై జిల్లాలోని వివిధ పరిశ్రమల ప్రతినిధులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి పరిశ్రమ వారి వార్షిక ఆదాయంలో రెండు శాతం నిధులను విద్య, వైద్యం, తదితర మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగించాల్సి ఉందన్నారు. ఇప్పటికే కొన్ని పరిశ్రమల యాజమాన్యాలు స్వచ్ఛందంగా ఖర్చు చేస్తున్నాయని, వినియోగిస్తున్న నిధులు పనుల వివరాలు జిల్లా యంత్రాంగానికి తెలియజేయకపోవడం, దుర్వినియోగం జరుగుతోందన్నారు. పరిశ్రమల యాజమాన్యం సిఎస్‌ఆర్‌ ఫండ్స్‌ ద్వారా చేపట్టే పనుల వివరాలను ముందస్తుగా జిల్లా యంత్రాంగానికి తెలియజేసి ఆమోదం పొందాలని సూచించారు. జిల్లా యంత్రాంగం ఆమోదంతో చేసే నిధుల వినియోగానికి సెక్షన్‌ 80జి సర్టిఫికెట్‌ కూడా అందజేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో సిపిఒ బి.శ్రీనివాసరావు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ఉయ్యాల ఆదిశేషు, డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ ఆర్‌.త్రినాధరావు, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ ఇఇ కె.వెంకటేశ్వర్లు, భీమవరం మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌.శివరామకృష్ణ, అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ ఎ.లక్ష్మి, వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.