Apr 10,2023 23:11

బాధ్యతలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ ఎమ్‌.గౌతమి

         అనంతపురం కలెక్టరేట్‌ : అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో అనంతపురం జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని నూతన కలెక్టర్‌ ఎమ్‌.గౌతమి తెలిపారు. సోమవారం ఉదయం కలెక్టర్‌ ఛాంబర్‌లో అనంతపురం జిల్లా నూతన కలెక్టర్‌గా గౌతమి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అనంతపురం జిల్లా అభివృద్ధికి వనరులు మెండుగా ఉన్నాయన్నారు. గతంలో తాను జిల్లాలో ఆర్డీవోగా పని చేసిన అనుభవంతో జిల్లాను అభివద్ధి పథంలో ముందు నిలుపుతానన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ, వాలంటీర్‌ వ్యవస్థల ద్వారా పరిపాలనలో మార్పులు వచ్చాయన్నారు. ప్రజలకు మరింత అందుబాటులో ఉంటూ సేవలు అందించే అవకాశం దక్కిందన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందించేందుకు కషి చేస్తానన్నారు.
నూతన కలెక్టర్‌కు అధికారుల స్వాగతం
కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతమిని పలు శాఖల జిల్లా అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్‌అండ్‌బి అతిథి గహం వద్ద బస చేసిన కలెక్టర్‌కు జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌ స్వాగతం పలికారు. కలెక్టరేట్లో డీఆర్వో గాయత్రీ దేవి, కలెక్టరేట్‌ ఏవో విజయలక్ష్మి, ఆర్డీవో మధుసూదన్‌, డీఐపీఆర్వో గురుస్వామి శెట్టి, ఎల్డీఎం నాగరాజ రెడ్డి, తహశీల్దార్‌ శ్రీధర్‌ మూర్తి తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు.
ఆర్డీవో నుంచి కలెక్టర్‌ వరకు..
కలెక్టర్‌ ఎమ్‌.గౌతమి మొదటగా 2007 నుంచి 2009 వరకు చిత్తూరు జిల్లాలో ప్రొబేషనరీ డిస్ట్రిక్ట్‌ కలెక్టర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2009 నుంచి 2012 వరకు అనంతపురం ఆర్డీవోగా పనిచేశారు. 2012-15 వరకు నెల్లూరు డ్వామా పీడీగా, 2015-19 వరకు టీటీడీ డిప్యూటీ ఈవోగా, 2019-22 వరకు కడప జాయింట్‌ కలెక్టర్‌గా, 2022-23 వరకు తిరుపతి ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ సీఈవోగా పలు పదవుల్లో పనిచేశారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.