నల్లరిబ్బన్లతో మెకానిక్‌ల నిరసన
ప్రజాశక్తి-తిరుపతి సిటి
ఆటోనగర్‌లో ఆ సంఘం ఆధ్వర్యంలో మెకానిక్ షాపుల యాజమాన్యం ఆందోళన నిర్వహించింది. నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతనెల 4న ప్రభుత్వం ఆటోనగర్‌లోని వర్కుషాపులన్నింటికీ జీవో నంబర్ 5 ద్వారా కన్వెర్షన్ చేసుకుని, ఇపుడు మార్కెట్ విలువ ప్రకారం అర్ధభాగం ఛార్జీలు కట్టమనడం శోచనీయమన్నారు. ఆటోనగర్‌లోని కార్మికులందరూ పేద కుటుంబాలకు చెందిన వారేనని, మెకానిక్‌లు, పెయింటర్లు, టింకర్లు, ఆటోమొబైల్స్, ఎలక్ట్రీషియన్స్‌గా రోజు కూలీలుగా జీవిస్తున్నారన్నారు. రెండు దశాబ్దాల క్రితం రోడ్డు ఛార్జీలు, కాల్వలు, స్థలం విలువ కూడా తమ వద్దే వసూలు చేసిన ప్రభుత్వం ఇపుడు ప్రస్తుత మార్కెట్ ప్రకారం డబ్బులు చెల్లించాలనడం సరైనది కాదన్నారు. దీన్ని వెంటనే రద్దు చేయాలని, లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లోకనాధరెడ్డి, సరితా నాగరాజు, విజరుకుమార్, రమణారెడ్డి, శివకుమార్, లోకేష్, టిఎస్ రాజేష్ పాల్గొన్నారు.










