ప్రజాశక్తి - అనంతపురం కలెక్టరేట్ : జీవోనెంబర్ 47లోని అసంబద్దాలను సరిచేయాలని ఫ్యాప్టో అనంతపురం జిల్లా ఛైర్మన్ ఎస్. సిరాజుద్దీన్, శ్రీ సత్య సాయి జిల్లా ఫ్యాప్టో ఛైర్మన్ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా ఆదివారం జిల్లాకేంద్రంలోనిసైన్స్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి డివైఈవో పద్మప్రియకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ మే 17న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమక్షంలో విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయ సంఘాలతో జరిపిన చర్చలలో అన్ని రకాల ఉపాధ్యాయ పదోన్నతులు మాన్యువల్ గా జరుపేందుకు హామీ ఇచ్చారన్నారు. అయితే ఇచ్చిన హామీకి భిన్నంగా ఉపాధ్యాయుల ప్రమోషన్లు ఆన్‌లైన్‌లో జరిపేందుకు చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఖాళీలు ఎక్కడ ఉన్నాయో చూపకుండా ప్రమోషన్లు వద్దనుకునే వారు రాతపూర్వకంగా అన్ విల్లింగ్ తెలపాలని ఆంక్షలు విధిస్తున్నారన్నారు. ప్రస్తుతం పదోన్నతులు ఇచ్చే ప్రక్రియ గతంలో దానికి పూర్తిగా భిన్నంగా ఉందన్నారు. ఉపాధ్యాయులు ప్రమోషన్ల కోసం దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నారని అన్నారు. 2022 జూలైలో ఒకసారి 2022 జనవరిలో మరొకసారి ప్రమోషన్లు ఇస్తామని ఉపాధ్యాయుల నుండి విల్లింగ్ తీసుకుని ప్రమోషన్ల వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని అది తేలిన తర్వాత ప్రమోషన్లు ఖరారు చేస్తామని నమ్మించి రూ.2500 అలవెన్స్ తో నాలుగు నెలలు పాటు పని చేయించుకున్నారని విమర్శించారు. తిరిగి మొత్తం ప్రమోషన్ కౌన్సిలింగ్ రద్దుచేసి అందరికీ నిరాశ కలిగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా ఎలాంటి ఖాళీలు చూపకుండా విల్లింగ్ ఇచ్చిన వారికే ప్రమోషన్లు కల్పిస్తామని అధికారులు చెబుతున్నారని అది కూడా ఇంతవరకు . షెడ్యూల్‌ను కూడా ప్రకటించలేదని మండిపడ్డారు. అధికారుల ధోరణి వల్ల అనేకమంది ఉపాధ్యాయులు నష్టపోతున్నారని అన్నారు. ఏ ఖాళీలను బ్లాక్ చేయరాదని బదిలీల జీవోలోని ఉన్న అసంబద్దాలను సవరించాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ జి. లింగమూర్తి, డిప్యూటీ సెక్రటరీ జనరల్స్ రమణరెడ్డి, గోవిందరాజులు, శ్రీనివాసరెడ్డి, నాయకులు బి. నరసింహులు, గోపాలరెడ్డి, సూర్యుడు, జి. వెంకటేష్,నాగేంద్ర, విశ్వనాథరెడ్డి,రత్నం, అనిల్, చంద్ర,దేశారు నాగరాజు,సర్దార్‌వలి, ఎర్రిస్వామి, శివ శంకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.










