Jan 07,2023 20:35

జీవో 1 రద్దు అయ్యే వరకు పోరాటం సాగిద్దాం
రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు
ప్రజాశక్తి- పలమనేరు:
ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే రాష్ట్రప్రభుత్వం జీవో 1ను తెరపైకి తెచ్చిందని, ఈ జీవో రద్దుకు రాష్ట్రవ్యాప్తంగా ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలువురు వక్తలు పిలుపునిచ్చారు. శనివారం ప్రభుత్వం తెచ్చిన జీవో1ని నిరసిస్తూ స్థానిక సిపిఎం కార్యాలయంలో ప్రజాసంఘాల నాయకులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే విధంగా జీవో నెంబర్‌ ఒకటిని తీసుకురావడం దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే హక్కులకు భంగం కలిగించే జీవోలు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు, ర్యాలీలు, సభలు నిర్వహించుకునే హక్కు భారత రాజ్యాంగం కల్పించిందని, కానీ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాసే విధంగా ప్రజాస్వామ్య గొంతులను నొక్కే విధంగా జీవో నెంబర్‌ ఒకటినీ తీసుకురావడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఈ విధానాలన్నింటిని తీసుకువచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాసమస్యలపైన రోడ్లమీదకి వచ్చిన సంఘటన ముఖ్యమంత్రికి గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కాపాడాలని ప్రభుత్వం తీసుకు వచ్చినటువంటి జీవో నెంబర్‌ ఒకటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వర్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఓబుల్‌ రాజు, జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా నాయకులు డివి మునిరత్నం, ఐద్వా జిల్లా కన్వీనర్‌ భువనేశ్వరి, ఎఐటియుసి డివిజన్‌ నాయకులు మద్దెల సుబ్రమణ్యం, ప్రజానాట్యమండలి యువజన నాయకులు ప్రతాప్‌, శివకుమార్‌, పార్థసారధి, పాకాల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.