ప్రజాశక్తి- చిత్తూరు: స్వయం సహాయక సంఘాలు జీవనోపాదులను పెంచుకోవాలని చిత్తూరు డిఆర్డిఏ పిడి తులసి తెలిపారు. శుక్రవారం జిల్లా సమాఖ్య సమావేశ మందిరం చిత్తూరులో నూతన జిల్లా సమాఖ్య ప్రతినిధుల ఆధ్వర్యంలో సమాఖ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పిడి హాజరై మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల అభ్యున్నతి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. స్వయం సహాయ సంఘ సభ్యులు ఈ పథకాలను సద్వినియోగం చేసుకొని జీవనోపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలని అన్నారు. సభ్యులు కేవలం వ్యక్తిగత రుణాలకే పరిమితం కాకుండా సమిష్టిగా చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటుకు చొరవ చూపాలన్నారు. స్థానికంగా ఉన్న వనరులు మార్కెటింగ్ సదుపాయాలు పరిశ్రమల స్థాపనపై సంపూర్ణ పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకుని కార్యాచరణకు సిద్ధం కావాలన్నారు. దీనివల్ల సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు పలువురికి ఉపాధి కల్పించవచ్చన్నారు. ఎస్‌ఇఆర్‌పి బ్యాంక్ లింకేజీ డీజీఎం కేశవ్‌కుమార్ మాట్లాడుతూ సంఘాల్లోని పొదుపునిధిని రుణాలుగా తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. బ్యాంకు రుణాలపైనే ఆధారపకుండా సంఘాల పొదుపునిధుల నుంచి రుణాల పొందడంలో అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. మైక్రో ఫైనాన్స్ సంస్థలకు సంఘ సభ్యులు దూరంగా ఉండడం శ్రేయస్కరమన్నారు. సమావేశంలో కెనరా బ్యాంక్ జిఎం గణేష్, డిసిసిబి జనరల్ మేనేజర్ లిల్లీలు, స్వయం సహాయ సంఘాలకు అందించే పలు పథకాలపై వివరించారు. కార్యక్రమంలో డిపిఎంలు వెంకటేష్, రవి, పలువురు ఏపీఎంలు జిల్లా సమాఖ్య ప్రతినిధులు డిఆర్డిఏ సిబ్బంది పాల్గొన్నారు.










