Oct 09,2023 22:14

జీతాలు తక్షణం చెల్లించాలి : యుటిఎఫ్‌

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: ఉద్యోగ, ఉపాధ్యాయ సెప్టెంబర్‌ జీతాలు, పెన్షనర్ల పెన్షన్‌ను ఇంతవరకు చెల్లించకపోవడం దారుణమని, వెంటనే చెల్లించాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి చౌదరి రవీంద్ర, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.అప్పారావు, ఎస్‌.కిషోర్‌ కుమార్‌ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి నెలాఖరు వరకు జీతాల కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్‌ ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని నెలలుగా ప్రతి నెలా ఐదో తేదీ తర్వాతనే చెల్లింపులు జరుగుతున్నాయని తెలిపారు. దీనివల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు ఇఎంఐలు సకాలంలో చెల్లించలేకపోవడంతో అదనపు వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. గత ఉద్యోగ, ఉపాధ్యాయ సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు చెల్లించాల్సిన పిఎఫ్‌, ఎర్నడ్‌ లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌, డిఎ, ఇతర బకాయిలు సెప్టెంబరు నాటికి చెల్లిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేర్చలేదని విమర్శించారు. 2003 నాటికి నోటిఫికేషన్‌ ఇచ్చి 2004 సెప్టెంబరు తర్వాత ఉద్యోగం పొందిన ఉపాధ్యాయ, ఉద్యోగ, పోలీసు సిబ్బందికి పాత పెన్షన్‌ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులనూ పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని తెలిపారు. డిఎస్‌సి-2003 వారికి పాత పెన్షన్‌ను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే పోరాటం తప్పదని హెచ్చరించారు.