కాలువలో పరుగులు తీస్తున్న కృష్ణాజలాలు
బెలుగుప్ప : కృష్ణాజలాలు హంద్రీనీవా కాలువ ద్వారా పరవాళ్లు తొక్కుతూ మండల పరిధిలోని జీడిపల్లి రిజర్వాయర్‌కు చేరుకున్నాయి. శ్రీశైలం జలాశయం నుంచి ఎత్తుపోతుల పథకం ద్వారా హంద్రీనీవా కాలువకు నీళ్లు వదిలిన విషయం తెలిసిందే. ఈ నీరు రాగులపాడుకు చేరడంతో అక్కడి నుంచి మూడు పంపుల ద్వారా మండలంలోని రామసాగరానికి వదిలారు. అక్కడి హెడ్‌రెగ్యులేటర్ నుంచి హంద్రీనీవా కాలువల ద్వారా జీడిపల్లి రిజర్వాయర్‌లో ప్రవేశించాయి. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం నీటి మట్టం 1.68 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.5 టీఎంసీలు ఉన్నట్లు ఎఇ షర్ఫుద్దీన్ తెలిపారు. కృష్ణాజలాలు జీడిపల్లి రిజర్వాయర్‌కు రావడంతో చుట్టుపక్కల గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.










