
* ప్రజాసంఘాల నాయకుల మహా రాయబారం
* 'స్పందన'లో జాయింట్ కలెక్టర్‌కు వినతి
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: 80 కేజీల జీడిపిక్కల బస్తాకు రూ.16 వేలు మద్దతు ధర చెల్లించాలని, రైతుభరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ప్రజాసంఘాల నాయకులు జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్‌ను కోరారు. మహా రాయబారం పేరిట నగరంలోని జెడ్‌పి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఏడాది జూలై 19వ తేదీన జీడి రైతులతో మంత్రి అప్పలరాజు, కలెక్టర్ నిర్వహించిన సమావేశంలో ఇచ్చిన హామీలు నేటికీ నెరవేర్చలేదన్నారు. రైతులు పండించిన జీడిపిక్కల ధర రోజురోజుకూ తగ్గుతుంటే, వ్యాపారులు ఉత్పత్తి చేస్తున్న జీడిపప్పు ధర ఆకాశాన్ని అంటుతోందన్నారు. 2019లో 80 కేజీల జీడి పిక్కల బస్తా రూ.14వేలు పలికితే, నేడు రూ.ఏడు వేలు చెల్లిస్తామని వ్యాపారులు చెప్తున్నారని తెలిపారు. రైతాంగం తీవ్ర దోపిడీకి గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న బిజెపి, రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న వైసిపి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రైతు పండించిన పంటలను ఆర్‌బికెల ద్వారా కొనుగోలు చేస్తామని చెప్తున్న ప్రభుత్వం, జీడిపిక్కలను ఎందుకు కొనడం లేదన్నారు. జీడిపిక్కల ధర పడిపోతే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. జీడి రైతులకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నా మంత్రి అప్పలరాజుకు పట్టడం లేదని, మద్దతు ధర కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం లేదని విమర్శించారు. మద్దతు ధరకు ఆరు నెలలుగా రైతులు ఆందోళన చేస్తుంటే, జిల్లాలోని మంత్రులు, స్పీకర్ స్పందించడం లేదన్నారు. తక్షణమే వారు జోక్యం చేసుకుని రైతాంగానికి న్యాయం చేయాలని కోరారు. కేరళ తరహాలో జీడి బోర్డు, కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. స్థానికంగా రైతులు పండించిన జీడి పిక్కలు కొనుగోలు చేసిన తర్వాతే విదేశీ జీడిపిక్కల దిగుమతికి అనుమతించాలని డిమాండ్ చేశారు. జీడి రైతులు ఒంటరిగా లేరని, వారి పోరాటానికి ఉద్యోగ, కార్మిక, కర్షక సంఘాలు మద్దతుగా ఉన్నాయన్నారు. మహా రాయబారంలో జీడి రైతు సంఘం జిల్లా కన్వీనర్ తెప్పల అజరు కుమార్, ఎపి రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.మోహనరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ కె.నాగమణి, కౌలు రైతుసంఘం జిల్లా కార్యదర్శి పి.ప్రసాదరావు, మత్స్యకార సంఘం జిల్లా కో-కన్వీనర్ ఐ.పాపయ్య, టి.శాంతారావు ఎఐటియుసి నాయకులు చిక్కాల.గోవిందరావు, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎం.ఆదినారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.