
* జిఒ ఇచ్చాకే జిల్లా పర్యటనకు సిఎం రావాలి
* రాష్ట్రస్థాయి జీడి సదస్సులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి, పలాస: ప్రభుత్వం జీడి పంటకు మద్దతు ధర ఇస్తుందా? లేదా? అన్నది తేల్చాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. జీడికి గిట్టుబాటు ధర, జీడి పంట సమగ్రాభివృద్ధికి బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యాన శ్రీకాకుళం జిల్లా పలాసలోని టికెఆర్ కళ్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వస్తున్నారని తెలిసిందని, జీడి పంటకు మద్దతు ధర, రైతుభరోసా కేంద్రాల ద్వారా కొనుగోళ్లకు జిఒ ఇచ్చాకే రావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం జీడిపిక్కల దిగుమతులపై సుంకం తగ్గించడం వల్ల దిగుమతులు వెల్లువలా వచ్చి ఇక్కడి పంట అమ్ముడుపోవడం లేదని చెప్పారు. రైతులు కష్టపడుతుంటే, వ్యాపారులకు లాభం చేకూరే విధానాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని విమర్శించారు. ఢిల్లీ వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులను కలుస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దిగుమతి సుంకం పెంచి రైతులను ఆదుకోవాలని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. కనీసం జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలోనూ ప్రస్తావించకపోవడం రైతులపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. కేంద్ర ప్రభుత్వం జీడి రైతులకు అన్యాయం చేస్తున్నా, వైసిపి, టిడిపి, జనసేన బిజెపి ప్రభుత్వానికి పల్లకి మోస్తున్నాయని విమర్శించారు. జీడి పంటకు గిట్టుబాటు ధర రాక రైతులు ఇబ్బందులు పడుతుంటే, ఈ ప్రాంతానికి చెందిన మంత్రి అప్పలరాజు వ్యాపారుల పక్షాన నిలబడుతున్నారని విమర్శించారు. కేబినెట్ సమావేశాల్లో ఒక్కసారైనా ఈ అంశంపై మాట్లాడారా అని ప్రశ్నించారు. మంత్రి అప్పలరాజుకు కమీషన్లు ముడుతున్నాయని, తాడేపల్లికీ వెళ్తున్నాయనే అనుమానం వ్యక్తం చేశారు. జీడి పరిశ్రమల్లో పనిచేస్తున్న మహిళ కార్మికులకు కనీస వేతనాలు, పిఎఫ్, ఇఎస్‌ఐ అమలు కావడం లేదన్నారు.
గిట్టుబాటు ధరకు మార్కెట్ వ్యవస్థ
80 కేజీల జీడిపిక్కల బస్తాకు రూ.16 వేల మద్దతు ధర ఇవ్వాలని ఎపి రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు, కార్మికులకు మేలు చేయడంలో కేరళ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. జీడి పంట అభివృద్ధికి బోర్డు, మార్కెట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జీడి ఉత్పాదకతో పాటు దిగుబడి పెంచే చర్యలను చేపట్టాలన్నారు.
గిట్టుబాటు ధర వచ్చే వరకు పోరాటం
జీడి రైతులు ఆరు నెలలుగా మద్దతు ధర కోసం పోరాడుతుంటే ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా దళారులు దోపిడీ చేసే విధానాలను బిజెపి, వైసిపి ప్రభుత్వాలు అవలంభిస్తున్నాయన్నారు. జీడి పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు మాట్లాడుతూ రైతులు, కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే అంతా కలిసి సమిష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు.
జీడి రైతుల సంఘం జిల్లా కన్వీనర్ తెప్పల అజరు కుమార్ మాట్లాడుతూ జీడిపిక్కలకు ధర లేదని మంత్రి అప్పలరాజును రైతులు అడిగితే, అంతర పంటలు వేసుకుంటే లాభం వస్తుందంటూ ఉచిత సలహా ఇస్తున్నారని మండిపడ్డారు. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు తామాడ సన్యాసిరావు మాట్లాడుతూ ఉద్దానం ప్రాంతానికి బతుకుదెరువుగా ఉన్న జీడి పంటకు మద్దతు ధర కోసం పాలకులను ప్రశ్నించాలన్నారు. సిపిఐ నాయకులు చాపర వేణుగోపాల్ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం రైతులు, కార్మికుల పొట్టగొడుతోందని విమర్శించారు. సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు వంకల మాధవరావు మాట్లాడుతూ ఏళ్ల తరబడి జీడి రైతులు పాలకుల చేతిలో దగా పడుతున్నారని, అంతా కలిసి ఐక్యంగా ఉద్యమించాలన్నారు. తొలుత ఇటీవల మృతి చెందిన సిపిఎం సీనియర్ నాయకులు కొల్లి సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ప్రజా కళాకారులు హేమసూదన్ బృందం అభ్యుదయ గీతాలను ఆలపించారు. సదస్సులో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి, గంగరాపు సింహాచలం, నాయకులు ఎన్.గణపతి, పి.ప్రసాదరావు, బి.శ్రీరాములు, రైతుసంఘం నాయకులు కె.గోపీనాథ్, ఎస్.లక్ష్మీనారాయణ, జె.ప్రసాదరావు, హేమారావు చౌదరి, పి.కుసుమ తదితరులు పాల్గొన్నారు.