Oct 26,2023 21:41

సమావేశంలో మాట్లాడుతున్న అజరు కుమార్‌

* జీడి రైతుసంఘం జిల్లా కన్వీనర్‌ అజరు కుమార్‌
ప్రజాశక్తి - పలాస: 
80 కేజీల జీడిపిక్కల బస్తాకు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలని, రైతుభరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్న జీడి రైతుల డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం తగదని జీడి రైతుసంఘం జిల్లా కన్వీనర్‌ తెప్పల అజరు కుమార్‌ అన్నారు. కాశీబుగ్గలోని సిఐటియు కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జీడికి మద్దతు ధరను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఆరు నెలలుగా అనేకరూపాల్లో ఆందోళనలు చేపడుతున్నా స్పందించకపోవడం దారుణమన్నారు. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న వైసిపి ప్రభుత్వం, జీడి రైతుల గోడు పట్టడం లేదని విమర్శించారు. వైసిపి చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఎవరిని మభ్యపెట్టడానికని ప్రశ్నించారు. రైతుల గోడు వినకుండా, సమస్యలు పరిష్కరించకుండా యాత్రలు చేయడం వల్ల ప్రజానీకానికి ఒరిగేదేముందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా జీడికి మద్దతు ధరపై ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో జీడి రైతుసంఘం నాయకులు కె.వినోద్‌ కుమార్‌, కె.గురయ్య, అంబటి రామకృష్ణ, సిఐటియు నాయకులు ఎన్‌.గణపతి తదితరులు పాల్గొన్నారు.