Oct 09,2023 22:24

జీడి రైతుకు దగా

* విదేశీ పిక్కలకు కేంద్రం దిగుమతి సుంకం తగ్గింపు
* దళారుల దయాదాక్షిణ్యానికి రైతులను వదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం
* ప్రశ్నించని టిడిపి, జనసేన
* రైతులను చైతన్యపరిచేందుకు నడుంబిగించిన సిపిఎం
* నేడు కాశీబుగ్గలో రాష్ట్ర సదస్సు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: జీడి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దగా చేస్తున్నాయి. విదేశీ జీడిపిక్కల దిగుమతులపై సుంకాన్ని తగ్గించి దేశీయ రైతులకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన జీడి పంటకు మద్దతు ధర ప్రకటించకుండా, కొనుగోళ్లు చేయకుండా దళారుల దయాదాక్షిణ్యానికి వదిలేస్తోంది. 80 కేజీల జీడిపిక్కల బస్తాకు రూ.16 వేలు, ప్రభుత్వం ఆర్‌బికెల ద్వారా కొనుగోలు వంటి డిమాండ్లతో ఆరు నెలలుగా పలురూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పైగా జీడిపిక్కలకు ధర, కొనుగోళ్లపై ప్రభుత్వం ఆలోచన చేస్తోందంటూ రైతులను మభ్యపెట్టే మాటలు చెప్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించాల్సిన టిడిపి, జనసేన నోరు మెదపడం లేదు. ఈ నేపథ్యంలో జీడి రైతులకు జరుగుతున్న అన్యాయం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి, ప్రశ్నించలేని ప్రతిపక్షాల తీరును వివరించి రైతులను చైతన్యపరచాలని సిపిఎం నిర్ణయించింది. అందులో భాగంగా కాశీబుగ్గలోని టికెఆర్‌ కళ్యాణ మండపంలో మంగళవారం రాష్ట్ర సదస్సు నిర్వహిస్తోంది.

         జిల్లాలో జీడి రైతుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది. మద్దతు ధర వస్తుందని ఆశతో నేటికీ రైతులు పిక్కలను అమ్మకుండా దాచుకున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 70 వేల ఎకరాలకు పైగా జీడి సాగు ఉందని ఉద్యానశాఖ అధికారులు చెప్తున్నారు. సాధారణంగా ఎకరాకు ఐదు బస్తాల దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. ఉద్దానం ప్రాంతంలో ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి వ్యాపారులు జీడి పంట కొనుగోళ్లు ప్రారంభించారు. ఏప్రిల్‌ రెండో వారం వరకు 80 కేజీల బస్తాకు రూ.10,500 వరకు చెల్లించారు. పంట చేతికి రావడం, రైతుల వద్ద పుష్కలంగా పిక్కలు ఉండడంతో, క్రమేణా ధర తగ్గిస్తూ రూ.ఎనిమిది వేల వరకు ఇచ్చారు.
పప్పుకు రేటు... రైతులకు పోటు
పలాస జీడిపప్పుకు మంచి రేటున్నా, ముడిసరుకుకు ధర రాకపోవడంపై రైతులకు అంతుచిక్కడం లేదు. 80 కేజీల జీడిపిక్కలను ప్రాసెస్‌ చేయిస్తే 25 కేజీల పప్పు దిగుబడి వస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో కేజీ పప్పు రూ.700 నుంచి రూ.800 పలుకుతోంది. ఈ లెక్కన 25 కేజీలకు రూ.17,500 నుంచి రూ.20 వేల వరకు వస్తోంది. దీంతో పాటు 65 కేజిల జీడి తొక్కు వస్తుంది. కేజీ రూ.15కు అమ్మినా రూ.975 వస్తుంది. మొత్తం కలిపి రూ.18,475 నుంచి రూ.20,975 వరకు వస్తోంది. ప్రాసెసింగ్‌, కూలీల ఖర్చులు, విద్యుత్‌ ఛార్జీలు, వ్యాపారం లాభం అన్ని కలిపి రూ.రెండు వేలు మినహాయిస్తే రూ.16,475 నుంచి రూ.18,975 మిగులుతోంది. రైతులు ప్రస్తుతం రూ.16 వేలు అడగడం సమంజసమే అన్న అభిప్రాయం అంతటా వినిపిస్తోంది.
మూడేళ్లుగా మోసమే...
జీడి పిక్కల కొనుగోళ్లు, మద్దతు ధర విషయంలో స్థానిక మంత్రి సీదిరి అప్పలరాజు మూడేళ్లుగా రైతులను మోసం చేస్తూనే ఉన్నారు. 2020లో వ్యాపారులు, రైతులతో సమావేశం నిర్వహించి 80 కేజీల జీడిపిక్కల బస్తాకు రూ.10 వేలుగా ప్రకటించారు. అందులో ప్రభుత్వం తరుపున రూ.వెయ్యి చెల్లిస్తామని హామీనిచ్చారు. ఇప్పటివరకు ఆ డబ్బులు ఇవ్వలేదు. తర్వాత సంవత్సరం ప్రభుత్వమే పిక్కలను కొంటుందని, 80 కేజీల బస్తాకా లేక క్వింటాకా ధర నిర్ణయంలో ఉందంటూ మంత్రి అప్పలరాజు ఆ ఏడాది ఊరించారు. ఇప్పటివరకు ఆ డబ్బులూ ఇవ్వలేదు. ఇప్పుడు మళ్లీ ఏమీ తెలియనట్లు ఈ ఏడాది జూలై 19వ తేదీన వ్యాపారులు, రైతులతో సమావేశం నిర్వహించిన మంత్రి అప్పలరాజు రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండానే బస్తాకు రూ.తొమ్మిది వేలు ఇచ్చేయండంటూ వ్యాపారులను ఆదేశించి సమావేశం ముగించారు. జీడిపిక్కలకు 80 కేజీల బస్తాకు రూ.తొమ్మిది వేలకు కొనాలంటూ వ్యాపారులకు ఉచిత సలహా ఇచ్చారు. జీడిపంట చేతికొస్తున్న మార్చిలోనే వ్యాపారులు రూ.పది వేల వరకు చెల్లించారు. బస్తాకు రూ.వెయ్యి తగ్గించి రూ.తొమ్మిది వేలకు కొనుగోలు చేయాలనడంపై రైతులు మండిపడుతున్నారు. పైగా వ్యాపారులకు మేలు చేసేలా కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చారు. ఇప్పటివరకు రైతుల నుంచి తూకం వేసి జీడి పిక్కలను కొనుగోలు చేస్తున్న వ్యాపారులకు ఇక ఆ శ్రమ అవసరం లేకుండా చేసేందుకు ప్రభుత్వమే వారికి రైతు భరోసా కేంద్రాల ద్వారా పిక్కలను కొని వ్యాపారులకు ఇస్తామని చెప్తున్నారు. రైతులకు మేలు చేయాల్సిన మంత్రి, వ్యాపారులకు ప్రయోజనం చేకూరేలా వ్యవహరించడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రశ్నించని టిడిపి, జనసేన
జీడిపిక్కలకు ధర, కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేస్తున్నా ప్రధాన ప్రతిపక్షం టిడిపి, జనసేన కనీసం ప్రశ్నించడం లేదు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విదేశీ పిక్కల దిగుమతులపై సుంకాన్ని తగ్గించడంతో పాటు ఎస్‌ఇజెడ్‌లకు మరింత స్వేచ్ఛగా దిగుమతులకు అవకాశం కల్పించింది. దీంతో దేశీయ జీడి రైతులు నష్టపోతున్నారు. జీడిపిక్కలకు రూ.16 వేలు మద్దతు ధర ప్రకటించాలని, ప్రభుత్వమే కొనుగోళ్లు చేయాలని రైతులు ఆరు నెలలుగా ఆందోళన చేస్తున్నా, దానిపై కనీసం మాట్లాడకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
కాశీబుగ్గలో నేడు సదస్సు
జీడికి గిట్టుబాటు ధర, జీడి పంట సమగ్రాభివృద్ధికి బోర్డు ఏర్పాటు వంటి ప్రధాన డిమాండ్లతో సిపిఎం ఆధ్వర్యాన కాశీబుగ్గలో నేడు రాష్ట్ర సదస్సును నిర్వహించనున్నారు. స్థానిక టికెఆర్‌ కళ్యాణ మండపంలో ఉదయం పది గంటలకు ప్రారంభం కానుంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్య వక్తగా పాల్గోనున్న సదస్సులో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్‌, ఎపి రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.సూర్యనారాయణ, జిల్లా కార్యదర్శి కె.మోహనరావు పాల్గొని ప్రసంగించనున్నారు.