
ప్రజాశక్తి- పలాస: పలాస సాయి బాలాజీ జీడి పరిశ్రమ కార్మికులపై మోపిన అభియోగాలు నిరాధారమైనవని, ఆ పేరుతో జీడి పరిశ్రమలను మూత వేసి జీడి కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తున్నారని, జిల్లా లేబర్ అధికారులు జోక్యం చేసుకుని జీడి కార్మికులకు న్యాయం చేయాలని కాష్యూ లేబర్ అసోసియేషన్ అధ్యక్షుడు అంబటి ఆనందరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్.గణపతి డిమాండ్ చేశారు. కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద లేబర్ అసోసియేషన్ ఆధ్వర్యాన బుధవారం నిరసన తెలిపారు. తక్షణమే జీడి పరిశ్రమలను తెరిపించి కార్మికులకు ఉపాధి పనులు కల్పించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రుజువు లేని ఆరోపణలు మోపి జీడి యాజమాన్యం కార్మికులకు ఇబ్బందికి గురిచేయడం తగదన్నారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే రిలే నిరాహారదీక్షలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు జోగి నాగేశ్వరరావు, ఆ పరిశ్రమ కార్మికులు లండ రమణ, కె. కోదండరావు, యూత్ లీడర్లు బొంపల్లి సునీల్ వర్మ, పల్లికష్ణా ఆటో యూనియన్ నాయకులు కిర్రి బాబూరావు, మోహనరావు, బైరాగి తదితరులు పాల్గొన్నారు.