
* నేటి నుంచి తెరుచుకోనున్న పరిశ్రమలు
ప్రజాశక్తి - పలాస: జీడి పరిశ్రమల సంఘం, జీడి కార్మికుల సంఘాల మధ్య తలెత్తిన విభేదాలు సమసిపోయాయి. జీడిపరిశ్రమల సంఘ కార్యాలయంలో వ్యాపారులు, కార్మిక సంఘ నాయకుల మధ్య శుక్రవారం నిర్వహించిన చర్చలు సఫలం కావడంతో శనివారం నుంచి జీడి పరిశ్రమలు తెరుచుకోనున్నాయి. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామని భావించడంతో చర్చలు కొలిక్కి వచ్చాయి. ఇప్పటివరకు చేసిన పరస్పర ఆరోపణలు వెనక్కి తీసుకోవడంతో సమస్య పరిష్కారానికి అడుగులు ముందుకు పడ్డాయి. ఈ సందర్భంగా జీడి పరిశ్రమల సంఘం అధ్యక్షులు మల్లా సురేష్ కుమార్, కార్యదర్శి కెవి శివకష్ణ, కోశాధికారి పట్నాన రవికాంత్ మాట్లాడుతూ తమ సమస్యలపై కార్మిక సంఘ నాయకులు సానుకూలంగా స్పందించి పరిష్కరించడానికి చొరవ తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. కార్మిక సంఘ అధ్యక్ష, కార్యదర్శులు భీమారావు, బొమ్మాళి తాతయ్య మాట్లాడుతూ ఇరు సంఘాల ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యమని, చిన్న పొరపొచ్చాలు వచ్చినా సంఘపరంగా పరిష్కరించుకోవడం ఉత్తమమన్నారు. కార్యక్రమంలో మల్లా శ్రీనివాసరావు, శాసనపురి మురళీకృష్ణ, బి.నారాయణరావు, కొత్తకోట తిరుమలరావు, కోట్ని శశి, ఎస్.సతీష్ కుమార్, బొంపల్లి సింహాచలం, ఆదినారాయణతో పాటు కార్మికులు, వ్యాపారులు పాల్గొన్నారు.