Oct 10,2023 20:38

కలెక్టర్‌ ప్రశాంతి
ప్రజాశక్తి - భీమవరం
జిఇఆర్‌ను ఛైల్డ్‌ ఇన్‌ఫోÛలో క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో నాడు-నేడు, జిఇఆర్‌, హౌసింగ్‌, ప్రాధాన్యత భవనాలు తదితర అంశాలపై మండలాలవారీగా సంబంధిత డివిజన్‌, మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంగళవారం సమీక్షించారు. ఈ నెల 16న ముఖ్యమంత్రి విశాఖపట్నం నుండి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్స్‌ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారని తెలిపారు. అదేరోజు జిల్లాలో ప్రతి మండలంలో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు మండలస్థాయి అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాలో తాడేపల్లిగూడెం, భీమవరం, నరసాపురం పట్టణాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడంతోపాటు ఎంఒయులను కూడా చేసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఇంతవరకు స్కిల్‌డెవలప్‌మెంట్‌ కోర్సులో శిక్షణ తీసుకున్నవారు, తీసుకుంటున్నవారు, తీసుకోవాలని ఆసక్తి కనబరిచే వారిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలన్నారు. పిఎం విశ్వకర్మ యోజన కార్యక్రమం ద్వారా నేతకారులు, స్వర్ణకారులు, కమ్మరి, తాళాలు చేసే వారు, కుమ్మరులు, శిల్పులు, చెప్పులు కుట్టేవారు, తాపీ పని చేసే వారు, లాండ్రీ కార్మికులు, క్షురకులు వంటి వారు ప్రయోజనం పొందేందుకు రిజిస్ట్రేషన్లు సర్పంచి లాగిన్‌ నుండి చేయాల్సి ఉంటుందన్నారు. జిఇఆర్‌ డేటాను ఛైల్డ్‌ ఇన్ఫోలో పక్కాగా ఎలాంటి పొరపాట్లకూ తావులేకుండా అప్డేట్‌ చేయాలన్నారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని, ప్రారంభం కాని నిర్మాణాలు లబ్ధిదారులతో మాట్లాడి ప్రారంభించేలా ఒప్పించాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో హౌసింగ్‌ పీడీ డాక్టర్‌ ఆర్‌సి.ఆనంద్‌కుమార్‌, డిఇ పిచ్చయ్య, పంచాయతీరాజ్‌ ఎస్‌ఇ శ్రీనివాసరావు, ఐసిడిఎస్‌ పీడీ బి.సుజాతరాణి, డిఇఒ ఆర్‌.వెంకటరమణ పాల్గొన్నారు.