Oct 29,2023 21:35

మాట్లాడుతున్న మంత్రి అప్పలరాజు

* బస్సు యాత్రను విజయవంతం చేయాలి
* పశుసంవర్థక శాఖ మంత్రి అప్పలరాజు
ప్రజాశక్తి - పలాస: 
సామాజిక న్యాయం ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డితోనే సాధ్యమని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నవంబరు 3న చేపట్టే సామాజిక సాధికార బస్సు యాత్ర సన్నాహక సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను యాత్రలో వివరించనున్నట్లు తెలిపారు. వైసిపి ప్రభుత్వం ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు అన్ని పదవుల్లో సముచిత స్థానం కల్పించిందన్నారు. ఆయా తరగతుల సంక్షేమానికి పలు పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. టిడిపి ప్రభుత్వంలో ఒక్క మైనార్టీకి కేబినెట్‌లో చోటు కల్పించలేదన్నారు. అలాంటి పార్టీ అన్నీ చేస్తున్న వైసిపి ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలను వివరించాలన్నారు. సామాజిక సాధికారతకు జగన్‌ నాంది పలికారని కొనియాడారు. సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు నిర్మించి గ్రామ పరిపాలనా దిశగా అడుగులు వేశారన్నారు. ఏ పథకం కావాలన్నా ఎక్కడో దూరాన ఉన్న మండల కార్యాలయాలకు, జన్మభూమి కమిటీల చుట్టూ కాళ్లరిగేలా తిరగనవసరం లేకుండా అర్హతే ప్రామాణికంగా వారి గ్రామాల్లోనే అందిస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెల మూడో తేదీన చేపట్టే సామాజిక సాధికార బస్సుయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వైసిపి సీనియర్‌ నాయకులు హనుమంతు వెంకటరావు, నియోజకవర్గంలోని ముడు మండలాల నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.