
* నేటి నుంచి బాబు అరెస్టుపై ఇంటింటా ప్రచారం
* టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్ అన్నారు. రానున్న రోజుల్లో వైసిపి నాయకులు ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు. నగరంలోని టిడిపి జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆధారాల్లేకుండా అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టడంపై గురువారం నుంచి ఇంటింటా ప్రచారం చేసి ప్రజలకు వివరిస్తామన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై 22 రోజులుగా జిల్లాలో చేపడుతున్న రిలే దీక్షలను నిలిపివేసి నేరుగా ప్రజల మధ్యకు వెళ్లి జరుగుతున్న పరిణామాలను వివరిస్తామన్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేష్ సతీమణి బ్రాహ్మణి ప్రజల్లోకి రావడం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపిందన్నారు. ఇదే పట్టుదలను చంద్రబాబు సిఎం అయ్యేంత వరకు కొనసాగించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బాబు అరెస్టును ఖండిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శాంతియుతంగా దీక్షలు, నిరసనలు, ర్యాలీలు చేస్తుంటే జిల్లా పోలీసు యంత్రాంగం నియంతృత్వంతో వ్యవహరించిందన్నారు. నాయకులను అక్రమ పద్ధతిలో అరెస్టులు, గృహ నిర్బంధం చేయడం, అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తోందని ధ్వజమెత్తారు. పోలీసు అధికారుల నియంతృత్వ పోకడలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. జగన్ రాజ్యాంగాన్ని అనుసరించి పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని విమర్శించారు.
చంద్రబాబును కేవలం రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారని విమర్శించారు. ఇంకా ఆధారాలను సేకరిస్తున్నామని సిఐడి అధికారులు చెప్తూ న్యాయస్థానాలను సైతం పక్కదారి పట్టిస్తున్నారన్నారు. వైసిపి నాయకులు, కార్యకర్తలు భూకబ్జాలు, ఇసుక అక్రమ రవాణా, పేకాట శిబిరాలపై పోలీసు అధికారులు ఎందుకు దృష్టిపెట్టడం లేదని ప్రశ్నించారు. తమ పార్టీ నాయకుల వల్ల జిల్లాలో ఎక్కడైనా శాంతిభద్రత సమస్య ఏర్పడిందని పోలీసులు నిరూపించగలరా అని అన్నారు. సమావేశంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు పి.ఎం.జె బాబు, టిడిపి రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి కోరాడ హరగోపాల్, బిసి సెల్ అధ్యక్షులు కలగ జగదీష్, కలగ గోపాల్, పట్నాల పార్వతీశం, ప్రధాన విజయరాం తదితరులు పాల్గొన్నారు.