Jun 25,2023 10:45
  • కుటుంబ మ్యాపింగ్ విభజనకు అవకాశం                 
  • 11 రకాలు ధూపత్రాల జారికి నిర్ణయం 
  • రేషన్ కార్డ్ సంక్షేమ పథకాలతో  ప్రజలకు లబ్ది                                                                            

ప్రజాశక్తి-రోళ్ళ : బియ్యం కార్డులు, పింఛన్ల పునరుద్ధరించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని సంకల్పంతో జగనన్న సురక్ష పథకాన్ని రూపొందించినట్లు తెలిసింది. దీని ద్వారా కుటుంబాలకు కొంత వరకు మేలు జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా కుటుంబ మ్యాపింగ్‌ విభజనకు అవకాశం కల్పిస్తున్నట్టు చెబుతున్నారు. గతంలో ఒకే బియ్యం కార్డులో కుటుంబంలో అందరూ ఉన్న వివిధ కారణాలతో కొందరి రేషన్ కార్డులు రద్దు చేశారు. అనర్హులైన వారు ఉన్నారంటూ ఆ కుటుంబంలోని వారికి బియ్యం కార్డు, పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు నిలిపేశారు. ఇందువల్ల ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందనే నివేదికలతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలుస్తోంది.
సంక్షేమ పథకాలకు ప్రతి బంధకంగా మారిన ఆరు సూత్రాల విధానం వల్ల చాలామంది అర్హులకు పథకాలు అందడం లేదన్న నివేదిక ప్రభుత్వానికి అందినట్లు తెలిసింది. ఓకే  కుటుంబంలో  వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు పింఛను అందడం లేదన్న విమర్శలు ప్రభుత్వం సేకరించినట్లు సమాచారం. ఒకే కుటుంబానికి ఒకే పింఛను విధానం వల్ల అత్త, కోడలు, వితంతువులు అయితే ఎవరో ఒకరికే పింఛన్లు అందుతున్నాయి. మరొకరికి అందడం లేదు. కుటుంబంలో తల్లిదండ్రులు కూలి పని చేసుకుంటున్నా కుమారుడు లేదా కుమార్తె విదేశాల్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ఆదాయపు పన్ను చెల్లిస్తుంటే తల్లిదండ్రుల బియ్యం కార్డుని అధికారులు నిలిపివేయడం వల్ల వారు సంక్షేమ పథకాలకు దూరమయ్యారు. కార్డులో ఉన్న ఒక వ్యక్తికి కారు ఉన్నా బియ్యం కార్డు తొలగించారు. మూడు నాలుగు పోర్షన్లకు కలిపి ఒకే మీటరు ఉండటం వల్ల 300 యూనిట్లు దాటితే వారికి కార్డు తొలగించారు. పట్టణాల్లో వెయ్యి చదరపు అడుగులకు మించిన ఇల్లు ఉన్నా రేషన్‌ కార్డు ఉండటం లేదు. ఇలా పలు రకాల ఆంక్షలతో రేషన్‌ కార్డులు తొలగించడం వల్ల అనేక సంక్షేమ పథకాలను అర్హులు కూడా పొందలేక పోతున్నారన్న నివేదిక ప్రభుత్వానికి అందినట్లు సమాచారం.
ఇందుకు సంబంధించి పలు రూపాల్లో ప్రభుత్వం సురక్ష ద్వారా పరిష్కారం చూపిస్తూ వెలుసుబాటును ప్రభుత్వం  ఇచ్చింది. దీంతో అనర్హులను కార్డు నుంచి తొలగించి మిగతా వారికి బియ్యం కార్డు పునరుద్ధరణకు అవకాశం ఇచ్చారని అధికారులు చెబుతున్నారు. ఇందుకు గాను గతంలో ఉన్న కుటుంబ మ్యాపింగ్‌ విభజనకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంటున్నారు. ఈమేరకు పలు మార్గదర్శకాలు జారీచేశారు. దీంతోపాటు సచివాలయాల ద్వారా 11 రకాల ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందక కొంత మంది సంక్షేమ పథకాలను సకాలంలో పొందలేకపోతున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఇందుకోసం వారంలోగా ధ్రువీకరణ పత్రాల జారీకి అవకాశం కల్పించారు. వీటిల్లో కుల, ఆదాయ, పుట్టిన, మరణించిన, నివాస ధ్రువీకరణ, స్థలాలు, పొలాలకు మ్యూటేషన్‌ ఫర్‌ ట్రాన్సాక్షన్‌, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, ఈడబ్ల్యూఎస్‌, ఆధార్‌ కార్డులకు మొబైల్‌ నెంబరు అనుసంధానంతో కూడిన అప్‌డేట్‌, పుట్టిన తేదీ, కొత్త రేషన్‌ కార్డులు, తదితర ధ్రువీకరణ పత్రాలను జూలై 23 వరకు సచివాలయాల నుంచి జారీ చేయాలని నిర్ణయించారు. కొంత కాలంగా వాలంటీర్లు స్థానికంగా ఉండకుండా కేవలం ఒకటో తేదీన సామాజిక పింఛన్లు పంపిణీకి పరిమితమై ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో  ప్రభుత్వ సేవల్లో మందగమనం పెరిగిందన్న ఫిర్యాదులు ప్రభుత్వానికి వెళ్లాయి. ఇందువల్ల సచివాలయాల నుంచి సకాలంలో సేవలు అందడం లేదన్న నివేదికల నేపథ్యంలో సురక్ష కార్యక్రమం ద్వారా ఒక్కో వాలంటీరుకు ఒక్కో సచివాలయ ఉద్యోగిని, ఇతర అధికారులను కేటాయించి ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.