జగన్‌ను తరిమి కొట్టే రోజులు దగ్గరకొచ్చాయి
జీవితంలో మొదటిసారి జైలుకొచ్చా : చంద్రబాబు
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి
మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశానని, అత్యధికంగా ప్రతిపక్షంలో కూడా ఉన్నానని, కానీ జీవితంలో మొదటిసారి జైలుకొచ్చానని నారా చంద్రబాబునాయుడు అన్నారు. కుప్పంలో అన్న క్యాంటీన్ ధ్వంసం, బ్యానర్ల గొడవ ఘటనలో జైలుకెళ్లిన ఎనిమిది టిడిపి నాయకులను పరామర్శించారు. అనంతరం ఆయన జైలు బయట ఉన్న కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడారు. 34 ఏళ్లుగా కుప్పంలో ఎంఎల్‌ఎగా ఉన్నానని, ఇది ఎంతో శాంతి కలిగిన ప్రాంతమని, అలాంటి చోట వైసిపి గూండాలు గొడవలు చేశారని వాపోయారు. రాష్ట్రంలో తనను తిరగనీయకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారనని ఆరోపించారు. తాను పర్యటిస్తున్న ప్రాంతంలో వైసిపి గుండాలు వస్తే వారిని బయటకు పోనీయకుండా టిడిపి నాయకులపైనే కేసులు బనాయించడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. జైలుకెళ్ళిన ఈ ఎనిమిది మంది నాయకులను టిడిపి గౌరవంగా వారి ఇంటికి పంపిస్తుందని, ప్రతి కార్యకర్తకూ అండగా ఉండగా ఉంటానని చెప్పారు. రాష్ట్రంలో మరో స్వాతంత్య్ర పోరాటం సాగుతోందని, నాడు బ్రిటీష్ వారిపైన, నేడు జగన్ ఉన్మాదంపైన సాగుతోందని చెప్పారు. 'జగన్‌రెడ్డీ నీకు వార్నింగ్, రాష్ట్రంలో నిన్ను తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. నీ రౌడీల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తా'నని చెప్పారు. రాష్ట్రంలో 175 స్థానాల్లో కాదు, ధైర్యముంటే జగన్‌ను పులివెందులలో గెలువు చూద్దామని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అమర్‌నాధ్‌రెడ్డి మాజీ ఎంఎల్‌ఎలు, టిడిపి నాయోజకవర్గ ఇన్‌ఛార్జీలు పాల్గొన్నారు.
'కఠారి కుటుంబానికి అండగా ఉంటాం'
చిత్తూరుఅర్బన్: కఠారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉటుందని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. మంగళవారం కుప్పం అన్న క్యాటింగ్ ఘర్షణల్లో చిత్తూరు సబ్‌జైల్‌లో ఉన్న కుప్పం టిడిపి నేతలను పరామర్శించారు. అనతరం చిత్తూరు మాజీ మేయర్ కఠారి హేమలతను గంగనపల్లిలోని వారి నివాసంలో పరామర్శించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కఠారి దంపతులు హత్యకేసులో పోలీసులు అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. సాక్షులను భయబ్రాంతులకు గురిచేసి కేసును నీరుగార్చాలని చూస్తున్నారని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును ప్రశ్నించిన మాజీమేయర్ హేలతపై పోలీసు జీపు ఎక్కిచడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ టిడిపి అధికారంలోకి వస్తే పోలీసుల సంగతి తేలుస్తామని హెచ్చరించారు. అధికార పార్టీ తొత్తులుగా మారిన పోలీసులు ఆటలు ఎంతోకాలం సాగవని అన్నారు. కఠారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. మాజీ మేయర్‌ను కలిసేందుకు గంగనపల్లికి వచ్చిన చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కఠారి యువసేన ఘనస్వాగతం పలికారు. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి అమరనాధరెడ్డి, ఎంఎల్‌సి దొరబాబు, తిరుపతి మాజీ ఎంఎల్‌ఎ సుగుణమ్మ పాల్గొన్నారు.
చిత్తూరు బయలుదేరిన గుడిపల్లి టిడిపి నాయకులు
గుడిపల్లి: మండలంలోని టిడిపి నాయకులు మంగళవారం చిత్తూరుకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలకడానికి భారీగా వాహనాలలో తరలి వెళ్లినట్లు కుప్పం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్.చంద్రశేఖర్ తెలిపారు. మండల పార్టీ అధ్యక్షులు టిఎం. బాబునాయుడు, మాజీ జెడ్పిటిసి బేటప్ప నాయుడు, టిడిపి నాయకులు హేమంబర్ గౌడు, గోపాల్, నారాయణ, రామయ్య, సుబ్రమణి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.










