రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనను ఎదుర్కొనే సత్తా జనసేనకే ఉందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన తాడేపల్లిగూడెం విచ్చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమావేశానికి జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దారుణంగా అణచివేస్తోందని విమర్శించారు. రాజకీయ కార్యకలాపాలు చేయడానికి భయపడే వాతావరణం రాష్ట్రంలో ఏర్పడిందన్నారు. నిజాయితీ పరుడైన పవన్‌కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేయాలంటే కేవలం నినాదాలుచేస్తే సరిపోదని, సమగ్ర ప్రణాళికతో పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. అనంతరం నాదెండ్ల మనోహర్‌ను గజమాలతో సత్కరించారు. అలాగే ఇటీవల మరణించిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, జనసేన పిఎసి సభ్యులు కనకరాజు సూరి, ఏలూరు ఇన్‌ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, పోలవరం ఇన్‌ఛార్జి చెర్రీ బాలరాజు, రాష్ట్ర కార్యదర్శులు పాల్గొన్నారు.










