Apr 17,2023 20:54

ప్రజాశక్తి - భీమవరం
'జగనన్నకు చెబుదాం'లో వచ్చిన దరఖాస్తులను జిల్లా అధికారులు పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరు కార్యాలయంలో జిల్లా, డివిజన్‌, మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టరు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టరు మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం పోర్టల్‌ను కొంతమంది అధికారులు ఓపెన్‌ చేసి చూడడం లేదన్నారు. ప్రతిరోజూ జగనన్నకు చెబుదాం పోర్టల్‌ ఓపెన్‌ చేసి సంబంధిత శాఖ అయినట్లయితే ఎస్‌ అని, కానట్లయితే నో అని కొట్టి సంబంధిత శాఖలకు ఫార్వర్డ్‌ చేయాలన్నారు. తమ శాఖలకు సంబంధించి దరఖాస్తులు అయితే వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. కొంత మంది తహశీల్దార్లు ఇన్‌కమ్‌ సర్టిఫికెట్‌ జారీ చేయడానికి నిర్ణీత సమయం కంటే ఎక్కువ సమయం తీసు కుంటున్నారని, ఇన్‌కమ్‌ సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేసిన వాటిని పరిశీలించి సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆదేశించారు. కోవిడ్‌ సోకకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని, ఫీవర్‌ సర్వేలో లక్షణాలున్న వారిని గుర్తించి వారందరినీ టెస్టులు చేసి పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారిని వెను వెంటనే హాస్పిటల్‌కు తరలించి చికిత్స కొనసాగించాలన్నారు. ఆధార్‌ అప్‌డేట్‌ పెండింగ్‌ ఇంకా చాలా ఉందని ఆధార్‌ అప్డేషన్‌ అన్ని సచివాలయాల్లో, పోస్టాఫీసుల్లో, బ్యాంకుల్లో త్వరితగతిన జరిగే విధంగా అధి కారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జెసి ఎస్‌.రామ్‌ సుందర్‌రెడ్డి, డిఆర్‌ఒ కె.కృష్ణవేణి, డిపిఒఎం నాగలత, డిఎల్‌పిఒ కెసిహెచ్‌ అప్పారావు, డిఎస్‌పి బి.శ్రీనాథ్‌ పాల్గొన్నారు.