అనంతపురం కలెక్టరేట్ : ప్రభుత్వం నిర్వహిస్తున్న జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ ఎం.గౌతమి, గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం గుంతకల్లు నియోజకవర్గంలోని పామిడి మండలం జి.కొట్టాల గ్రామ సచివాలయం వద్ద జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ప్రజల చెంతకే ప్రభుత్వ సేవలు అందుతున్నాయని చెప్పారు. జులై 1 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందులో 11 రకాల సర్టిఫికెట్లను ఎలాంటి సర్వీసు ఛార్జీలు లేకుండా ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే వై.వెంకటారామిరెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసమే ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ అభివద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. గడపగడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్ష కార్యక్రమాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా పకడ్బందీగా అమలు చేస్తున్నారని తెలిపారు. కుల,మతాలు, పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందిస్తున్నట్లు చెప్పారు. అనంతపురం ప్రజలకు వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్ లిఖిత, ఆర్డీవో రవీంద్రతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










