Oct 17,2023 21:58

వైద్యులను వివరాలు అడిగి తెలుసుకుంటున్న జెసి నవీన్‌

* జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌
ప్రజాశక్తి - ఆమదాలవలస: 
జగనన్న ఆరోగ్య సురక్షతో పేదల ఆరోగ్య భద్రతకు తొలి అడుగు పడిందని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ అన్నారు. పట్టణంలోని మోనింగివారి వీధి పట్టణ ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆరోగ్య సురక్ష శిబిరాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. వాలంటీర్లు, ఆరోగ్య కార్యదర్శులు క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వచ్చారా? ఆరోగ్య పరీక్షలు చేశారా? టోకెన్‌ ఇచ్చారా? సురక్ష క్యాంపు సమాచారం తెలిపారా? అని శిబిరానికి వచ్చిన ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ ప్రజల కనీస, సాధారణ స్థాయి వైద్య అవసరాలను గుర్తించి తక్షణ వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య సురక్ష దోహదపడుతుందని తెలిపారు. తద్వారా ఆరోగ్య సేవల కల్పనలో ప్రజల సంతృప్తి స్థాయిని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.రవిసుధాకర్‌, తహశీల్దార్‌ ఎం.గణపతిరావు, వైద్యులు డి.సురేష్‌, వార్డు సచివాలయ, మున్సిపల్‌, మెప్మా, అంగన్వాడీ సిబ్బంది, ప్రత్యేక వైద్యబృందం, పట్టణ ఆరోగ్య కేంద్రం సిబ్బంది, వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు.