పెద్దపప్పూరు:జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా అర్హులందరికీ ఉపయోగం చేకూరుతుందని కలెక్టర్ ఎమ్.గౌతమి తెలిపారు. బుధవారం నాడు మండల పరిధిలోని పెద్దపప్పూరు గ్రామం 2వ సచివాలయంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ గ్రామస్తులతో మాట్లాడారు. ప్రజలకు అవసరమైన కులం, ఆదాయం, నివాసం, అడంగల్, పింఛన్, రేషన్ కార్డు, వితంతువు, కుటుంబ సభ్యుల పేర్లు విభజన, ఆధార్‌లింక్, కౌలురైతులకు సిసిఆర్సి కార్డులు తదితర ధ్రువీకరణ పత్రాలను ఎలాంటి సర్వీసు ఛార్జీలు లేకుండా ఉచితంగా సులభతరంగా ఈ కార్యక్రమంలో పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. పరిష్కారం కాని సమస్యను చెప్పేందుకు జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ సేవలకు సంబంధించి 1902 టోల్ ఫ్రీ నెంబర్‌కి కాల్ చేయవచ్చునని తెలిపారు. అనంతరం గ్రామంలో అర్హులై మిగిలిపోయిన కుటుంబాలకు సంబంధించి 144 వివిధ రకాల సర్టిఫికెట్లను కలెక్టర్ పంపిణీ చేశారు. జగన్న సురక్ష కార్యక్రమం అనంతరం కలెక్టర్ డిఇఒ సాయిరాంతో కలిసి ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. విద్యార్థులు బాగా చదువుకుని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి ఓబులమ్మ, జడ్పీ సీఈవో భాస్కర్ రెడ్డి, తహశీల్దార్ లక్ష్మీనాయక్, స్పెషల్ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డి, ఎంపీడీవో రామకృష్ణ పాల్గొన్నారు.










