Jun 22,2023 21:50

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గౌతమి

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌    జిల్లాలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్‌ ఎమ్‌.గౌతమి జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం అనంతపురం కలెక్టరేట్‌ రెవెన్యూ భవనంలో జగనన్న సురక్ష కార్యక్రమంపై మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, ఎంపిడిఒలు, మున్సిపల్‌ కమిషనర్లు, ఇఒఆర్‌డిలతో కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నేడు సిఎం జగన్‌ 'జగనన్న సురక్ష' కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. సిఎం జగన్‌ ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. ఇందులో భాగంగా మండల స్పెషల్‌ ఆఫీసర్‌లు ఖచ్చితంగా మండలాన్ని విజిట్‌ చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనలను పాటించాలన్నారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలనే దానిపై శిక్షణ ఇవ్వాలన్నారు. క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లినప్పుడు అనేక రకాల సమస్యలు వస్తాయని, వాటిని ఎలా పరిష్కరించాలి అనేదానిపై దృష్టి సారించాలన్నారు. ముందుగానే పక్కాగా ప్రణాళిక వేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఎంపిడిఒల టీం, తహశీల్దార్‌ టీం, మున్సిపల్‌ కమిషనర్ల టీం ఏర్పాటు చేసుకోవాలన్నారు. సచివాలయాల పరిధిలో ఒక్క ఇల్లు మిస్‌ కాకుండా చూడాలని, వాలంటీర్లు 100 శాతం ఇంటింటికి వెళ్ళాలన్నారు. ప్రతి కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలని, జగనన్న సురక్ష కార్యక్రమం పూర్తయ్యే వరకు కంట్రోల్‌ రూమ్‌ ఉండాలన్నారు. వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లడం, రిజిస్ట్రేషన్లు చేయడం, ఏరోజుకారోజు డేటా ఇచ్చేలా చూడాలన్నారు. డాక్యుమెంట్లు కరెక్ట్‌గా ఉంటేనే సర్వీస్‌ రిక్వెస్ట్‌రైజ్‌ చేయాలన్నారు. ముందుగానే అన్ని డాక్యుమెంట్లను ప్రాపర్‌గా స్క్రూట్నీ చేసుకోవాలన్నారు. ఈ విషయం అందరికీ అర్థమయ్యేలా చెప్పాలన్నారు. జిల్లాలోని అన్ని సచివాలయాల్లోనూ నెట్‌ కనెక్టివిటీ ఉందా లేదా అనేది ఎంపీడీవోలు పరిశీలన చేయాలన్నారు. ఏర్పాటు చేస్తున్న జగనన్న సురక్ష క్యాంపుల్లో వెలుతురు, తాగునీరు ఉన్నాయా.. లేదా చూసుకోవాలన్నారు. నెల రోజులపాటు జిల్లాలో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమం నెల రోజుల యాక్టివిటీ అని, పూర్తిస్థాయిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. ప్రతి మండలంలో నాలుగు టీంలు ఏర్పాటు చేయాలని, అందులో లాజిస్టిక్‌ టీమ్‌ ఒకటి, రిజిస్ట్రేషన్‌ డెస్క్‌ ఒకటి, వెరిఫికేషన్‌ టీమ్‌ ఒకటి, జగనన్నకు చెబుదాం టీం ఒకటి ఏర్పాటు చేయాలన్నారు. ఆయా టీముల్లో ఉన్న వారికి తగిన శిక్షణ ఇవ్వాలన్నారు. ఇందులో భాగంగా మండల కార్యాలయాల్లో ఏర్పాటు చేసే కంట్రోల్‌ రూమ్‌ సరిగా పని చేయాలన్నారు. వచ్చిన రిక్వెస్టులను ఫాలోఅప్‌ చేయడం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌కుమార్‌, డిఆర్‌ఒ గాయత్రీదేవి, జడ్పీ సిఇఒ భాస్కర్‌రెడ్డి, ఆర్డీఓలు మధుసూదన్‌, నిశాంత్‌రెడ్డి, రవీంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, తహశీల్దార్‌లు, ఎంపిడిఓలు, తదితరులు పాల్గొన్నారు.